కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా ఏరో ఇండియా షో జరగనుంది. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ ఈ ఎయిర్ షో జరుగుతోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బృహత్ బెంగళూరు మహానగరపాలక సంస్థ (BBMP) కీలక నిర్ణయం తీసుకుంది. యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ చుట్టూ మాంసం దుకాణాలలో మాంసం విక్రయాలు ఆపేయాలని బీబీఎంపీ ఆదేశించింది. యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ చుట్టుపక్కల 13 కిలోమీటర్ల పరిధిలోని చికెన్, మటన్ షాపులలో మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. చికెన్, మటన్ దుకాణాలతో పాటుగా నాన్ వెజ్ వంటకాలు అందించే హోటళ్లు, రెస్టారెంట్లు కూడా బీబీఎంపీ ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుంది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ చుట్టూ ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
అయితే ఎయిర్ షోకు, చికెన్, మటన్ షాపులకు లింకేమిటని.. చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఎయిర్ షో జరిగితే, చికెన్ షాపులు, మటన్ దుకాణాలలో మాంసం విక్రయాలు ఎందుకు బంద్ చేయాలని.. హోటళ్లలో ఎందుకు నాన్ వెజ్ ఫుడ్ అందించకూడదనే డౌటనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అనుమానాలకు బీబీఎంపీ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. చికెన్, మటన్ షాపులు వంటి మాంసాహారం విక్రయించే చోట్ల గద్దలు, డేగలు వంటివి తిరుగుతుంటాయని.. అందుకే ఆంక్షలు విధించినట్లు చెప్తున్నారు. ఈ గద్దలు, డేగలు ఎయిర్ షో జరిగే సమయంలో ఆ ప్రాంతంలోకి వస్తే ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీబీఎంపీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీబీఎంపీ నిర్ణయానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. అలాగే ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు 1996 నుంచి బెంగళూరులో ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 14 ఎయిర్ షోలు నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ ఐదు రోజుల పాటు యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా 2025 ప్రదర్శన జరుగుతోంది. ఏరో ఇండియా షో దేశంలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శనగా చెప్తుంటారు. ఫిబ్రవరిలో జరిగే ఎయిర్ షోలో సుమారుగా 800 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 53 విమానాలు పాల్గొంటాయని.. 7 లక్షలమంది సందర్శకులు వస్తారని అధికారుల అంచనా. రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు, అంకుర పరిశ్రమలు, విదేశీ పెట్టుబడిదారులు ఇలా చాలా మంది ఈ ఎయిర్ షోకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.