ఇచ్ఛాపురంమున్సిపాల్టీ పరిధి సంతపేట జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం బొనసల గ్రామానికి చెందిన ఇసురు వినోద్ రెడ్డి(24), పాత్రపూర్ బురడ గ్రామానికి చెందిన బమ్మిడి కార్తీక్(24) ద్విచక్ర వాహనంపై పనుల నిమిత్తం ఇచ్ఛాపురం వచ్చారు. తిరిగి సాయంత్రం స్వగ్రామానికి వెళ్తూ భువనేశ్వరి అమ్మవారి ఆలయ జంక్షన్‌కు చేరుకునే సరికి బైక్ అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి దూసుకుపోయింది. ఇదే సమ యంలో అటువైపు నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న సోంపేట మండలం మాకన్నపురానికి చెందిన చిత్రాడ రమేష్, తాళభద్రకి చెందిన హనుమంత్ పల్లి కార్తీక్, చిత్రాడ సిద్దార్థను ఢీకొట్టారు. దీంతో ఒడిశాకు చెందిన ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. చిత్రాడ రమేష్ కాళ్లు, చేతులు విరిగి పోగా హనుమంత్‌పల్లి కార్తీక్ కాలు విరిగిపోయింది. చిత్రాడ సిద్దార్థ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.