మదనపల్లె మండలంలోని సీటీఎం గ్రామంలో చిట్లాకుప్ప వేసుకోవడానికి గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. ఆ మేరకు ఆదివారం వారు మదనపల్లె ప్రెస్‌క్లబ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేనెంబరు 354లో 1.80 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించగా ఎంపీపీ రెడ్డెమ్మ భర్త వెలుగుచంద్ర ఆ స్థలాన్ని క్రమించుకుని వేరే వారికి ఇచ్చి అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఇదివరకే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా సంక్రాంతి పండుగ కూడా చేసుకోకుండా తమను ఇబ్బంది పెట్టారని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు కృష్ణమూర్తి, వెంకటరమణ, నాగేంద్ర, నాగరాజ, రఘు, రెడ్డిలీల పాల్గొన్నారు.