కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ అన్నారు. సీపీఎం 27వ రాష్ట్ర మహాసభ, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు తెలకపల్లి నరసింహయ్య 6వ వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి - ప్రత్యామ్నాయ విధానాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముందుగా తెలకపల్లి నరసింహయ్య చిత్ర పటానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ అమరావతికి వేల కోట్ల రూపాయలు పెడతామంటున్నారని, అక్కడ కనీస వసతులు కల్పించి మిగిలిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. గోదావరి నీళ్లు బానకచర్లకు తీసుకొస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని అన్నారు. జగన్ సీఎంగా ఉండి కూడా సీమ అవసరాలు ఎలా తీర్చాలో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని విమర్శించారు. ఉన్న ప్రాజెక్టులకు పంట కాలువలు నిర్మిస్తేనే ఉపయోగం ఉంటుందని సూచించారు.