ఏపీ మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన నేత కిరణ్ రాయల్ స్పందిస్తూ... జనసేన నేతల దృష్టిలో మెగాబ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిపి నలుగురని చెప్పారు. నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని తాము కూడా పవన్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పవన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో దాన్నే కొనసాగిస్తే మంచిదని కిరణ్ చెప్పారు. అనవసర వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు విమర్శించడానికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు. రోజా, పేర్ని నాని వంటి వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని, అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వొద్దని చెప్పారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంపై డ్రోన్లు తిరుగుతున్నాయని అందుకే పవన్ కు భద్రత పెంచాలని అన్నారు.