ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు, తెలుగు వారు ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తమ డబ్బు ఖర్చు పెట్టి మరి తమను ప్రవాసులు గెలిపించారని చెప్పుకొచ్చారు. కొంత మందిని చనిపోయిన తర్వత గుర్తు పెట్టుకుంటారు.. కానీ నన్ను బతికుండగానే గుర్తు పెట్టుకున్నారని అన్నారు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ తెలుగు జాతిలో పుట్టాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలియజేశారు.‘‘అన్ని దేశాల్లో తెలుగువాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది. అదే మన గొప్పతనం. తెలుగువాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారు. రాణిస్తారు. పట్టుదల ఎక్కువ. నైపుణ్యాలు పెంచుకుంటారు. నేను జైల్లో చేసిన న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచారు. అప్పుడు ఇన్ని దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారా? అని ఆశ్చర్యపోయా. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నా. యువతలో సరికొత్త ఆలోచనలు రావాలి. చైతన్యవంతులు కావాలి’’
‘‘ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. యువత గ్రామాల నుంచి నగరాలకు వచ్చి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి, ఐటీరంగంలోకి వచ్చారు. హైదరాబాద్లో భూములు అమ్ముకోవద్దని అనేకమందికి చెప్పా. ఇక్కడి భూములకు మంచి ధర వస్తుందని ఆనాడే చెప్పా. తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయానికి హైదరాబాద్ సంపదే కారణం. చదువులో ఆడపిల్లలపై వివక్ష చూపించొద్దని ఆనాడే చెప్పాను. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి వెళ్లినా అమ్మాయిలు కనిపిస్తున్నారు. ప్రస్తుతం యువకుల కంటే యువతులకే ఎక్కువ ఆదాయం వస్తోంది. వాస్తవానికి పురుషుల కంటే మహిళలే తెలివైన వాళ్లు. పరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి.
సంపద సృష్టించడం కష్టం కాదు. 2047 నాటికి తెలుగువాళ్లు గొప్పగా ఉండాలనేదే నా లక్ష్యం. తెలుగు వాళ్లకు ప్రత్యేక గుర్తింపు రావాలి. తెలుగువాళ్లు అనేక కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చారు. ఉక్రెయిన్లో సమస్య వచ్చినప్పుడు ప్రవాసాంధ్రులు బాగా పని చేశారు. ఎక్కడికి వెళ్లినా మీరు మూలాలు మరిచిపోకూడదు. ఆ రోజు ఇంజినీరింగ్ కాలేజీలు తేవడం వల్లే మీరంతా చదువుకున్నారు. ఎంతో పోరాడి మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్లో పెట్టించా. మన రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రవాసాంధ్రులను ఎలా ప్రోత్సహించాలన్న దిశగా ఆలోచన చేస్తున్నాం. నిరంతర శ్రమ వల్లే తెలుగువాళ్లు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.