యూపీలో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాతో దాదాపు 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తోందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. వివిధ రంగాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆ సంస్థ సీఈవో సచిన్ అలగ్ లెక్కలు వేశారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. 45 రోజుల పాటు జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి 40 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.ఈ కార్యక్రమంతో యూపీలో ఆర్థికవృద్ధి, తాత్కాలిక ఉపాధి కల్పన జరుగుతుందని సచిన్ అలగ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభావం పలు రంగాలపై కనిపిస్తోందన్నారు. ఒక్క పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5 లక్షల మందికి ఉపాధి లభించవచ్చని వ్యాఖ్యానించారు. హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లుగా పలువురికి పని దొరుకుతుందని పేర్కొన్నారు.రవాణా రంగంలో డ్రైవర్లు, సప్లై చైన్, చైన్ మేనేజర్లు, ఇతర సేవలు అందించేందుకు 3 లక్షల మంది అవసరం ఉండవచ్చన్నారు. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు దక్కుతాయన్నారు. దర్శన్ యాప్స్, రియల్ టైమ్ ఈవెంట్ అప్డేట్ ప్లాట్ఫామ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో సేవలు అందించడానికి దాదాపు 2 లక్షల మంది అవసరం ఉండటంతో ఐటీ రంగ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందన్నారు.