రాష్ట్రంతో భావోద్వేగ బంధంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర వహిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 2023 ఆర్బీఐ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ఆర్ఐల ద్వారా భారతదేశంలోనే అత్యధికంగా 40,000 కోట్లకు పైగా రెమిటెన్స్‌లను అందుకుందని అన్నారు. జ్యురిచ్ లో తెలుగు డయాస్పోరా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా దృష్టిలో మీరు ఎన్ఆర్ఐ (NRI)లు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు... అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (MRI ) అని అభివర్ణించారు. తెలుగు ప్రవాసాంధ్రులు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. "ఏపీలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు, అక్రమ అరెస్టులు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మీరు భారీఎత్తున చేపట్టిన నిరసనలను యావత్ భారతదేశం చూసింది. ఎన్ఆర్ఐలపై మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో నలుగుర్ని ప్రవాసాంధ్రులను ఎమ్మెల్యేలను చేయడమేగాక, మరికొందరికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చాం" అని లోకేశ్ వివరించారు.ఇక్కడ పరిస్థితులు చూస్తే నేను జ్యూరిచ్ లో ఉన్నానా, జువ్వలపాలెంలో ఉన్నానా అన్న అనుమానం కలుగుతోంది. జ్యురిచ్ లో ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచాన్ని ఏలే సత్తా తెలుగువారికి మాత్రమే ఉంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది విశ్వవిఖ్యాత స్వర్గీయ నందమూరి తారకరామారావు. తెలుగువారిని ప్రపంచపటంలో నిలబెట్టింది మన విజనరీ చంద్రన్న. ఆనాడు విజన్ – 2020 అంటే ఎగతాళి చేశారు. నాడు ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నిజమైంది. న్యూయార్క్ లో చేతిలో ఫైల్... వెనక ఆఫీసర్లు... ఆ ఫోటో గుర్తుందా... మొదటిసారి సీఎం అయినపుడు మన చంద్రన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి, పెట్టుబడులు తేవాలని విదేశాల్లో పర్యటించేవారు. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తున్న హైదరాబాద్. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కంటే ఎక్కువ స్పీడ్ తో ఆయన మళ్లీ పరుగెడుతున్నారు, మమ్మల్ని పరుగెత్తిస్తున్నారు అని లోకేశ్ వివరించారు.