దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు జ్యూరిచ్ లో ఎన్ఆర్ఐలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తలు ఏపీకి ఎందుకు రావాలని అడిగితే, మా బ్రాండ్ సీబీఎన్ అని ఒకటే మాట చెబుతానని అన్నారు. "సీబీఎన్ పేరు చెప్పగానే ప్రపంచంలో ఏ కంపెనీ గేట్లు అయినా తెరుచుకుంటాయి... అదీ సీబీఎన్ సత్తా. చంద్రబాబునాయుడు ఒక పారిశ్రామికవేత్త అనే విషయం చాలామందికి తెలియదు. నాలుగు కంపెనీలను స్థాపించి మూడు ఫెయిలయ్యాక, హెరిటేజ్ విషయంలో సక్సెస్ అయ్యారు"అని లోకేశ్ వివరించారు. బాబుగారిని అరెస్టు చేసి జైలులో పెట్టినపుడు కూడా ఆయన ఎక్కడా అధైర్య పడలేదు. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడితే అంతిమంగా విజయం లభిస్తుందనడానికి చంద్రబాబు గారే ఉదాహరణ. గత ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడి 94శాతం సీట్లు సాధించాం. గత అయిదేళ్లలో అమరావతి ఉద్యమం కొనసాగించాం. ఉక్రెయిన్ లో తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చాం. పార్టీ ఆఫీసులో ఎంపవర్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి ట్రైనింగ్ ఇచ్చాం. నేను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయ్యాక ఓంక్యాప్ ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. ఓవర్ సీస్ లో బ్లూకాలర్ జాబ్స్ కోసం ఒకప్పుడు చంద్రబాబుగారే ఓంక్యాప్ ను ప్రారంభించారు. తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు గారితో పనిచేయడం అంత తేలికైన పనికాదు. ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు సెలవుపెట్టి భారత్ కు వచ్చి కూటమి విజయానికి కృషిచేశారు. అదే స్పూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి పనిచేయాల్సి ఉంది. కలసికట్టుగా పనిచేసి అయిదేళ్లలో ప్రపంచానికి ఎపి అంటే ఏమిటో చేసి చూపిద్దాం. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలకు వెనకాడం. రెడ్ బుక్ పని మొదలైంది, పూర్తిచేసే బాధ్యత నాది.... అని లోకేశ్ స్పష్టం చేశారు.