వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాలలో వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ‘తుంగభద్ర, కృష్ణా జలాల సంరక్షణ- అభివృద్ధి అంశంపై సమావేశం జరిగింది. సమితి ఉపాధ్యక్షులు వైఎన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడారు. ప్రతి ఏటా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి కొన్ని వందల టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకు పోతున్నాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో కృష్ణా నది ఎండిపోయిందని, నదిలో నీళ్లు లేవని చెబుతూ గోదావరి నుంచి బానకచర్లకు నీటిని మళ్లిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హక్కుగా ఉన్న నీటిని రాయలసీమ ఏనాడు పూర్తిగా వాడుకోలేదన్నారు. అందుకు కారణం దశాబ్దాల కింద మొదలు పెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకపోవడం, ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువల అసంపూర్తి, పంట కాలువల మరమ్మతులకు నోచుకోకపోవడమేనని అన్నారు. తుంగభద్ర, కృష్ణా జలాల సద్వినియోగానికి కార్యాచరణ చేపట్టకుండా పోలవరం ఆంధ్ర ప్రదేశ్‌కు జీవనాడి అని, గోదావరి నుంచి బానకచెర్లకు నీళ్లు తెచ్చి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడమేనని స్పష్టం చేశారు. ప్రజల హృదయ స్పందన అయిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల నిర్మాణాలను తక్షణమే చేపట్టాలని ఆయ న డిమాండ్ చేశారు. రాయలసీమలోని వనరుల వినియో గానికి కార్యాచరణ చేపట్టకపోతే ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న రాయలసీమ విముక్తి ఉద్యమానికి పాలకులే ఆజ్యం పోసిన వారవుతారని అన్నారు. సమావేశంలో సామాజిక రాయలసీమ పార్టీ నాయకులు డా.నాగన్న, కేడీసీసీ డైరెక్టర్ బెక్కం రామ సుబ్బారెడ్డి, మహమ్మద్ పర్వేజ్, ఏరువ రామచంద్రారెడ్డి, సౌదాగర్ ఖాసీంమియా, మాజీ సర్పంచులు రామగోపాల్‌రెడ్డి, కొమ్మా శ్రీహరి, రవికుమార్, పట్నం రాముడు, గాయకుడు గౌడ్, జనార్దన్ రెడ్డి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ నాయకులు ఆకుమల్ల రహీం, లాయర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.