భీమవరంలో కిడ్నాప్ కేసును పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. స్థానిక ఆక్వా వ్యాపారి సత్యనారాయణ అలియాస్ నాని కిడ్నాప్ కేసును ఆదివారం పోలీసులు సుఖాంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు. భీమవరానికి చెందిన సత్య ప్రసాద్, సురేష్ బాబు వద్ద ఆక్వా వ్యాపారి సత్యనారాయణ.. తక్కువ వడ్డికి నగదు తీసుకున్నాడు. అవి వడ్డీతో సహా రూ. 10 .70 కోట్లు అయింది. ఈ మొత్తం నగదు ఇవ్వాలంటూ సత్యనారాయణపై సత్యప్రసాద్, సురేష్ బాబులు తీవ్ర ఒత్తిడి చేశారు.ఈ నగదు ఇవ్వక పోవడంతో.. సత్యనారాయణ కిడ్నాప్‌కు ప్రణాళికలు రూపొందించారు. అందుకోసం అనంతపురంలోని కొందరిని సంప్రదించారు. దీంతో సత్యనారాయణను కిడ్నాప్ చేసిన నిందితులు.. కారులోనే చంపేస్తామని బెదిరించారు. దీంతో తన ఆస్తులు విక్రయించి.. నగదు ఇస్తానని హామీ ఇవ్వడంతో.. సత్యనారాయణను కిడ్నాపర్లు భీమవరం తీసుకు వచ్చారు. దీంతో భీమవరంలో నగదు ఇవ్వాలంటూ కత్తితో సత్యనారాయణను బెదిరిస్తుండగా.. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, తొమ్మిది సెల్ ఫోన్లు, వాకిటాకి, చాకు, క్రికెట్ వికెట్లు, హాకీ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు.