ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు. మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సీఎం అవ్వాలని, ఆయన్ని ఆ పదవిలో చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని జనసేన నేత కిరణ్ రాయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనవసరంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దంటూ టీడీపీ నేతలకు ఆయన హితవుపలికారు. పేర్ని నాని, రోజా వంటి పలువురు వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని, వారికి అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై రెండ్రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయని, దీనిపై ఐదుగురు అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ దేశానికి కావాల్సిన నాయకుడని, అందుకే భద్రత పెంచాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు.