రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న డీలర్లను కక్షపూరితంగా తొలగిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు. డీలర్ల తొలగింపుపై ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాకు ఫిర్యాదు చేశారు. కల్లూరు మండలంలో మార్కాపురం, తడకనపల్లె డీలర్లను ఇదివరకే తొలగించారని, ఇటీవల బస్తిపాడు డీలర్ రామ్మోహన్‌రెడ్డిని తొలగించి ఆయనతోపాటు మరికొందరిపైనే కేసుపెట్టించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఇళ్లు, పంటలను నాశనం చేస్తున్నారని, ఇందుకు ఇటీవల గడివేముల మండలం పైబోగుల సంఘటనే నిదర్శనమన్నారు. ఎన్ని అక్రమ కేసులుపెట్టినా, ఎంత హింసించినా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు.