విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అనేక గొప్ప పోరాటాల్లో ఉక్కు పోరాటం కూడా ఒకటన్నారు. నష్టం వస్తోందని చెప్పి సామర్థ్యాన్ని లెక్క చేయకుండా ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించుకుందని.. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన సహా ఎంతో మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశారని తెలిపారు. కేంద్రం మెడలు వంచుతామన్న వైసీపీ ఏమీ చేయలేదని విమర్శించారు. 22 మంది ఎంపీలు ఉన్నా కనీసం కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కూడా కోరలేదన్నారు. జగన్ ఆరోజు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించలేదని ప్రశ్నించారు.ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం రాజధాని, పోలవరం నిర్మాణాల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో విజయం సాధించిందన్నారు. ‘‘గత ప్రభుత్వం ఏం చేసింది,..ఢిల్లీకి అన్ని సార్లు వెళ్లిన జగన్ ఏం చేశారు.. జగన్ సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళారా’’ అని నిలదీశారు. కేంద్రం ఒకసారి నిర్ణయం తీసుకుని... తన ఆలోచనపై పునరాలోచన చేయడం అత్యంత అరుదన్నారు. చంద్రబాబు ప్రయత్నం, ఒత్తిడి, ప్రజల మనోభావాలను బలంగా వినిపించడం వల్లే ఇవాళ స్టీల్ ప్లాంట్‌కు జవసత్వాలు వచ్చాయన్నారు. ఇది సాధించడంలో కార్మికులు, ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం మరువలేనిదన్నారు. వైసీపీ ఐదేళ్లలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయలేదని మంత్రి పార్థసారథి విమర్శించారు.