అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తన పాత మిత్రుడు, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం సైనికుల గౌరవార్థం జరిగిన బాల్ డ్యాన్స్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. తన భార్య మెలానియాతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా సైనికులకు శాటిలైట్ కాల్ చేశారు. దక్షిణ కొరియాలో ఉన్న సైనికులతో ట్రంప్ మాట్లాడుతూ... 'అక్కడ ఎలా ఉంది? కిమ్ జోంగ్ ఎలా ఉన్నారు? గతంలో ఆయనతో స్నేహ సంబంధాలు నెరిపాను. ఆయన ఒక పట్టాన మాట వినే రకం కాదు' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2019లో వియత్నాంలో ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటీ అయ్యారు. అయితే, అణ్వాయుధాలను వదిలేసే అంశంలో కిమ్ వెనక్కి తగ్గకపోవడంతో వీరి మధ్య చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు ఒక సందర్భంలో కిమ్ అదృశ్యం అయ్యారు. 20 రోజుల తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించారు. అప్పుడు ట్రంప్ స్పందిస్తూ... కిమ్ ఆరోగ్యంగా తిరిగి రావడం సంతోషంగా ఉందని అన్నారు. బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత ఉత్తర కొరియాతో అమెరికాకు దూరం పెరిగింది. కిమ్ కూడా అమెరికా పట్ల మరింత కఠిన వైఖరితో ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినా... వ్యక్తిగతంగా ఎలాంటి చర్చలు జరపరాదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.