ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల జీన్స్ పాకెట్స్ మగవారి కంటే ఎందుకు చిన్నవిగా ఉంటాయో తెలుసా?

Life style |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2025, 11:28 PM

ప్రస్తుత తరంలో ఎక్కువ మంది వేసుకునే ట్రెండ్స్‌లో జీన్స్ ముందుంటుంది. మగ, ఆడ, చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జీన్స్ ప్యాంట్ ధరిస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర కనీసం ఒకటైనా జీన్స్ ప్యాంట్ ఉంటుంది. పురుషులే కాదు.. అమ్మాయిలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జీన్స్ దుస్తులు ధరిస్తున్నారు. అయితే, పురుషుల జీన్స్ పాకెట్ డెప్త్ కంటే మహిళల జీన్స్ పాకెట్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఇలా ఎందుకు చాలా చిన్నవిగా ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది. పురుషులు తమ జేబుల్లో అన్నీ అమర్చుకోగలిగినప్పుడు, మహిళలు తమతో పెద్ద పర్సులు లేదా బ్యాగ్‌లను ఎందుకు తీసుకెళ్లాలి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి కొద్దిగా చరిత్ర, ఫ్యాషన్ పోకడలపై ఓ లుక్కేద్దాం.


జీన్స్ అమెరికాలో శ్రామిక వర్గం కోసం పుట్టాయి. అప్పట్లో, మహిళలు ఎక్కువగా ఇంటి పనులు చేసేవారు. పురుషులు పొలాలు, కర్మాగారాల్లో పనిచేసేవారు. పురుషులు తమ ఉపకరణాలు లేదా ఇతర వస్తువులను పట్టుకోవడానికి పెద్ద పాకెట్స్ అవసరం. కాబట్టి వారి జీన్స్‌లో ప్యాకెట్స్ డెప్త్‌గా ఉండేలా డిజైన్ చేశారు. ఆ తర్వాత మహిళలు కూడా జీన్స్ ధరించడం మొదలుపెట్టారు.


స్టైల్


క్రమంగా జీన్స్ మహిళల ఫ్యాషన్‌లో భాగమైంది. అయితే మొదట్లో మహిళలకు జీన్స్ డిజైన్ పురుషుల డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే, కాలక్రమేణా జీన్స్ మహిళలకు మరింత స్టైలిష్‌గా ఉండేలా డిజైన్ చేశారు. పురుషుల జేబుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం వస్తువులను ఉంచడం. అయితే మహిళల పాకెట్స్ మాత్రం స్టైల్ కోసం డిజైన్ చేశారు. మహిళలు జీన్స్ ధరిస్తే స్టైల్ ఉండటం కోసం ఇలా డిజైన్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.


ఫ్యాషన్ ప్రభావం


స్త్రీల శరీర నిర్మాణం పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది. డీప్ పాకెట్స్ స్త్రీల శరీరాలను అసమతుల్యతగా కనిపించేలా చేస్తాయి. అంతేకాకుండా వారి బాటమ్స్ ఫ్లాబీగా కనిపిస్తాయి. మారుతున్న ఫ్యాషన్ పోకడలు మహిళల జీన్స్ పాకెట్స్ పరిమాణాన్ని కూడా ప్రభావితం చేశాయి. స్కిన్నీ జీన్స్, టైట్ ఫిట్టింగ్ జీన్స్ రావడంతో పాకెట్స్ సైజు కూడా చిన్నబోయింది. ఫ్యాషన్ పాయింట్ నుంచి మహిళలు పెద్ద ప్యాకెట్ జీన్స్‌తో ఆకర్షణీయంగా కనిపించరు. అందువల్ల, మహిళలు ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి చిన్న పాకెట్స్ జీన్స్ డిజైన్ చేశారు.


మార్కెటింగ్ ప్రభావం


పెద్ద లేదా అందమైన బ్యాగుల్ని మహిళల ఫ్యాషన్‌లో భాగం చేయడానికి జీన్స్ పాకెట్‌లను చిన్నవిగా డిజైన్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. చిన్న పాకెట్స్ కారణంగా, మహిళలు ఎల్లప్పుడూ తమతో పర్సు లేదా బ్యాగ్‌ని తీసుకెళ్లాలి. దీని వల్ల జీన్స్ మాత్రమే కాదు, చాలా మంది మహిళల బట్టలకు పాకెట్స్ ఉండవు లేదా చాలా చిన్నవిగా ఉంటాయి. అయితే, ఇప్పుడు కాస్తా ట్రెండ్ మారింది. ఇప్పుడు మహిళల కోసం అనేక జీన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి లోతైన పాకెట్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడు చాలా డ్రస్సుల్లో కూడా పాకెట్స్ తయారవుతున్నాయి. మహిళల్ని ఆకర్షించడం కోసం ఇలాంటి మార్పులు చేస్తున్నట్లు మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు.


జీన్స్ విషయంలో అమ్మాయిలు జాగ్రత్త


ఫ్యాషన్ కోసం చాలా మంది అమ్మాయిలు చాలా టైట్‌గా ఉండే జీన్స్ ప్యాంట్లు ధరిస్తున్నారు. అయితే, ఇలా చేయడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. జీన్స్ చర్మాన్ని గట్టిగా పట్టేస్తుంది. దీంతో.. చర్మం, నరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటికి రక్తప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో.. ఆ ప్రాంతాల్లో వాపులు వచ్చే ప్రమాదముంది. అంతేకాకుండా నడుం వద్ద చాలా టైట్‌గా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అజీర్తి, మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో సంతానలేమి సమస్యలు కూడా వస్తాయంటున్నారు. కాబట్టి.. అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com