భారత్ - ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. పూనేలో జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ను డిసైడ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. అదే ఇంగ్లండ్ విజయం సాధిస్తే ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లో రెండు జట్లు సమంగా ఉంటాయి. ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యతతో భారత్ ఉంది. కోల్ కత్తా, చెన్నైలో జరిగిన మొదటి, రెండో టీ 20 మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. కానీ రాజ్ కోట్ లో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో మాత్రం ఇంగ్లండ్ దే పైచేయి అయింది. 26 పరుగులు తేడాతో ఓటమి పాలయింది. మూడు మ్యాచ్ లలోనూ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ జట్టు మూడో మ్యాచ్ లో మాత్రం ఛేదనలో విఫలమయింది. భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నప్పటికీ బ్యాటర్లు మాత్రం ఎక్కువ సేపు క్రీజులో నిలబడనందునే రాజ్ కోట్ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యారు. అలాగే తొలి మ్యాచ్ లో తన బ్యాట్ తో అద్భుతం సృష్టించిన అభిషేక్ శర్మ తర్వాత పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. అనవసర షాట్లుకు వెళ్లి అవుటవుతున్నాడన్న వాదన ఉంది. ఇక రెండో మ్యాచ్ లో విజయం సాధించడానికి ప్రధాన కారణమైన తిలక్ వర్మ కూడా మూడో మ్యాచ్ లో విఫలమయ్యాడు. దీంతో ఇక బ్యాటర్లు విజృంభిస్తేనే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశముంది. అయితే పూనేలో మాత్రం భారత్ కు విజయాలు తక్కువగానే ఉండటంతో ఈ మ్యాచ్ పై అనేక అనుమానాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. సంజు శాంసన్, రింకూ సింగ్ లు కూడా తమ బ్యాట్ కు పనిచెప్పాల్సి ఉంటుంది. లేకపోతే పూనేలో విజయం అంత సులువు కాదన్నది క్రీడానిపుణుల అభిప్రాయం. భారత్ రాజ్ కోట్ లో జరిగిన ఓటమితో కొన్ని స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముందని తెలిసింది. అదే సమయంలో ఇంగ్లండ్ మూడో మ్యాచ్ లో గెలిచి ఊపు మీదుంది. భారత్ ను సొంత గడ్డపై ఓడించి ఈ సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ టీం భావిస్తుంది. అందుకే భారత్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంది. ఇంగ్లండ్ ను తక్కువ పరుగులకు కట్టడి చేయడంతో పాటు బ్యాటర్లు నిలదొక్కుకుని సత్తా చూపించాలని టీం ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలని ఆశిద్దాం.