శ్రీకాకుళం జిల్లాలో కేన్సర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేన్సర్ నివారణ కోసం ప్రభుత్వం.. ‘కేన్సర్ స్ర్కీనింగ్ శిక్షణ’ పేరిట 18 ఏళ్లు దాటినవారికి ఆర్యోగ పరీక్షలు నిర్వహిస్తోంది. గతేడాది నవంబరు 14 నుంచి జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కేన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో సుమారు 18,20,000 మందికి స్ర్కీనింగ్ పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 84 పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీల పరిధిలో ఇప్పటివరకు సుమారు 3 లక్షలు మందికి స్ర్కీనింగ్ పరీక్షలు చేశారు. ఇందులో 3,151 మందికి కేన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరీక్షల్లో వైద్యసిబ్బంది తేల్చారు. కేన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా కేన్సర్ లక్షణాలు బయటపడుతున్నాయి. కవిటి మండలం మాణిక్యపురం పీహెచ్‌సీ పరిధిలో 128 మందికి నోటి కేన్సర్, 16 మందికి రొమ్ము కేన్సర్, 21 మందికి సర్వైకల్ కేన్సర్ ఉన్నట్టు తేలింది. ఆమదావలస మండలం పురుషోత్తపురం పీహెచ్‌సీ పరిధిలో 26 మందికి నోటి కేన్సర్, 27 మందికి రొమ్ము, 16 మందికి సర్వైకల్ కేన్సర్ లక్షణాలు ఉన్నాయి. రెంటికోట పీహెచ్‌సీలో మందికి నోటి, 12 మందికి రొమ్ము, 16 మందికి సర్వైకల్ కేన్సర్ ఉంది. కొర్లాం పీహెచ్‌సీలో 39 మందికి నోటి, 9 మందికి రొమ్ము, 11 మందికి సర్వైకల్ కేన్సర్ లక్షణాలు ఉన్నాయి. ఎచ్చెర్ల పీహెచ్‌సీలో 37 మందికి నోటి, 34 మందికి రొమ్ము, 14 మందికి సర్వైకల్ కేన్సర్ ఉన్నట్టు గుర్తించారు. ఆమదాలవలస మండలం దూసి పీహెచ్‌సీలో 36 మందికి నోటి, 12 మందికి రొమ్ము, 10 మందికి సర్వైకల్ కేన్సర్ ఉంది. సంతబొమ్మాళి, పోలాకి, తాడివలస పీహెచ్‌సీల పరిధిలో 20 మందికిపైగా నోటి కేన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కేన్సర్ లక్షణాలు బయటపడినవారికి జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్)లో మరోసారి పరీక్షలు చేస్తున్నారు. కేన్సర్ లక్షణాలను నిర్ధారిస్తున్నారు. కాగా చాలామంది భయంతో పరీక్షలు చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. అటువంటి వారికి వైద్యఆరోగ్య శాఖ కౌన్సిలింగ్ చేస్తే తుది పరీక్ష చేయించుకునేందుకు అవకాశం ఉంది.