దంగల్ సినిమా చూసే ఉంటారుగా; ఒక తండ్రి తన కుతుర్లను ఆడపిల్లలు తక్కువగా ఆడే కుస్తీలో గెలిపించడం కోసం ఎంత ఎంత తపన పడ్డాడో అన్న కథ జాతీయ వ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేసింది. అలాంటి తండ్రులు నిజంగా కూడా ఉన్నారు అన్నదానికి నిదర్శనమే రామిరెడ్డి. ఇప్పుడు ‘అండర్ 19 మహిళల టి 20 మహిళల ప్రపంచ కప్’ సందర్భంగా దేశమంతా మార్మోగుతున్న పేరు త్రిష గొంగడి. త్రిష గొంగడి తండ్రే రామిరెడ్డి. ఈ సారి అండర్ -19 మహిళల టి 20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా, టోర్నీలో అత్యధిక స్ట్రైక్ రేట్ తో, టోర్నీ చరిత్రలోనే శతకం సాధించిన ఏకైక క్రికెటర్ గా, ఫైనల్ లో అత్యధిక వికెట్లు కూడా పడగొట్టి క్రీడా చరిత్రలో తనకంటూ ఒక శకాన్ని లిఖించుకున్న యువ క్రికెట్ క్రీడాకారిణే గొంగడి త్రిష.
త్రిష స్వస్థలం ఖమ్మంలోని భద్రాచలం. ఆమె తండ్రికి పిల్లలు పుట్టకముందు నుండే ఆడపిల్ల పుట్టినా, మగపిల్లాడు పుట్టినా ఎదో ఒక క్రీడలో ఆ బిడ్డను రాణించేలా చేయాలనే కల ఉండేది. త్రిష పుట్టాక,చిన్నప్పుడు క్రికెట్ చూస్తున్నప్పుడు అరవడం, కేరింతలు కొట్టడం చూసి ఆమెకు బాల్యంలోనే క్రికెట్ పై ఆసక్తి ఉందని గమనించాడు ఆమె తండ్రి. ముందు ఆమెకు బ్యాడ్మింటన్ లాంటివి పరిచయం చేసినా ఆమె ఆసక్తి క్రికెట్ లోనే ఉందని గమనించి అందులోనే ఆమెను ప్రోత్సహించాడు. స్వతహాగా రామిరెడ్డి కూడా ఒక క్రీడాకారుడు. గతంలో ఆయన కూడా హాకి, క్రికెట్ ఆడేవారు. తర్వాత జీవితంలో స్థిరత్వం కోసం జిమ్ ట్రైనర్ గా ఉద్యోగం చేస్తూ సొంత జిమ్ నడిపేవారు.
పిల్లలకు చిన్నప్పుడు తల్లిదండ్రులు కార్టున్ ఛానల్స్ చూపించడం సాధారణమైన విషయమే. కానీ రామిరెడ్డి మాత్రం దీనికి భిన్నంగా త్రిషకు క్రికెట్ ను చూపించేవారు. త్రిషకు రెండున్నర ఏళ్ల వయసు నుండే స్వయంగా తానే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు తనతో పాటు జిమ్ కు తీసుకువెళ్ళి,అక్కడ క్రికెట్ ప్రాక్టిస్ చేయించేవారు. తర్వాత మెరుగైన శిక్షణ కోసం ఆమెను హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్ లో చేర్పించారు.
త్రిష కేవలం క్రికెట్ కే పరిమితం కాలేదు. రోజు ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటలు క్రికెట్ ప్రాక్టిస్ ఉన్నా సరే, ట్యూషన్ పెట్టించుకుని మరి చదువులో కూడా వెనుకంజ వేయకుండా దూసుకుపోతూ ఉంది. త్రిష కోచింగ్ కోసం కుటుంబమంతా భద్రాచలం నుండి హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. రెండేళ్లలోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది. 2023లో త్రిషకు ఏకంగా ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. ఆ సిరీస్‌లో ఫైనల్‌లో 24 రన్స్ చేసి జట్టు విజయానికి తోడ్పడింది.ఇప్పుడు కౌలాలంపూర్ లో భారత మహిళల జట్టు ఐసీసీ అండర్-19 టీ 20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.ఈ ప్రపంచ కప్ లో అత్యద్భుతంగా ఆడి ప్రపంచవ్యాప్త ప్రసంసలు అందుకుంటుంది త్రిష గొంగడి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సీరిస్’ పురస్కారాలు కూడా సొంతం చేసుకుంది త్రిష. ఈ విజయంతో త్రిష అండర్ -19 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా 2023 లో శ్వేత అనే భారతీయ అమ్మాయి నమోదు చేసిన రికార్డును బద్దలు కొట్టింది. త్రిష ఆటను, గెలుపును, ఆమె పై ప్రపంచం కురిపిస్తున్న ప్రశంసలను చూసి రామిరెడ్డి మురిసిపోయారు.
ఆడపిల్లలకు క్రీడల్లో ప్రోత్సాహమే తక్కువగా ఉన్న నేపథ్యంలో మగవారి ఆటగా భావించబడే క్రికెట్ లో ప్రపంచ స్థాయి సత్తా చూపిన త్రిష ఆడపిల్లల్లు క్రీడల్లో ఏం సాధించగలరో చూపించే ఒక దిక్సూచి. తల్లిదండ్రుల ప్రోత్సహిస్తే పిల్లలు ఎంత ఎదగవచ్చో అన్నదానికి ఒక నిదర్శనం రామిరెడ్డి. మరెందరో త్రిషలు మన తెలుగు గడ్డ తేజాలై ప్రపంచ వెలుగులుగా భాసించాలని కోరుకుందాం!