ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో కూడుకుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. చాలా మంది వ్యాధులకు దూరంగా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే, చాలా మంది వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. కానీ, ఏ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో చాలా మందికి తెలియదు. కొంతమంది వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.
బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, కేలరీలు త్వరగా బర్న్ అవుతాయని భావిస్తారు. మరోవైపు ఇంకొందరు యోగా శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుందని నమ్ముతారు. అయితే, ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది, వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటో, ముప్పై నిమిషాల పాటు వాకింగ్ లేదా యోగా చేస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
30 నిమిషాల నడకతో ప్రయోజనాలు
గుండె ఆరోగ్యం
ప్రతి రోజూ ముప్పై నిమిషాలు నడవడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గుతుంది. రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి రోజూ వేగంగా నడిచే వారిలో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం 30 శాతం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
బరువు తగ్గవచ్చు
బరువు తగ్గడానికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. బరువు తగ్గడానికి సులభమైన, ప్రభావవంతమైన మార్గం వాకింగ్. ఒక సాధారణ నడక 150 నుంచి 200 కేలరీలను బర్న్ చేస్తుంది. వేగంగా నడిస్తే బర్న్ అయ్యే కేలరీల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు.
డయాబెటిస్ పేషంట్లకు మేలు
ముప్పై నిమిషాల నడక వల్ల డయాబెటిస్ పేషంట్లకు మేలు జరుగుతుంది. నడక రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును సాధారణంగా ఉంచడంలో సాయపడుతుంది. రెగ్యులర్ వాకింగ్ స్ట్రోక్, ఇతర వ్యాధుల్ని కూడా నివారిస్తుంది.
మానసక ఆరోగ్యానికి ఒక వరం
ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, వర్క్ లైఫ్ కారణంగా చాలా మంది ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ అరగంట నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగపడుతుంది. రెగ్యులర్ వాకింగ్ వల్ల మెదడులో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఎండార్ఫిన్లు మానసిక స్థితిని మెరుగుపర్చి.. ఒత్తిడిని తగ్గించడంలో సాయపడతాయి.
30 నిమిషాల యోగాతో ఆరోగ్య ప్రయోజనాలు
శరీరాన్ని బలంగా మారుస్తుంది
యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ యోగా వల్ల కండరాలు బలపడతాయి. శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది. వెన్నునొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పుల వంటి సమస్యలు ఉపశమనాన్ని యోగా అందిస్తుంది. యోగా చేయడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ప్రశాంతత
యోగా శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా విశ్రాంతినిస్తుంది. రోజూ యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా మారుస్తుంది.
జీర్ణవ్యవస్థ మెరుగు
పవనముక్తసనం, భుజంగాసనం, వజ్రాసనం వంటి కొన్ని యోగా భంగిమలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అసిడిటీ లేదా అజీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి యోగా బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా రోజూ యోగా చేయడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జలుబు, అలెర్జీలు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా రోగనిరోధక శక్తి కాపాడుతుంది.
రెండింటిలో ఏది బెస్ట్?
మీ లక్ష్యం బరువు తగ్గడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రించడం అయితే, నడక మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, సౌకర్యవంతమైన శరీరం, అంతర్గత బలం కావాలంటే, యోగా ఉత్తమమైనది.
రెండింటినీ కలపడం ఇంకా బెస్ట్
దినచర్యలో నడక, యోగా రెండింటినీ చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయం 15-20 నిమిషాలు యోగా చేసి, ఆపై 20-30 నిమిషాలు నడవండి. వారానికి 3 రోజులు యోగా, 3 రోజులు నడకను మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. మీరు బిజీగా ఉండి సమయం తక్కువగా ఉంటే, ఈ రెండింటిలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకుని క్రమం తప్పకుండా చేయండి.
![]() |
![]() |