అందంగా, స్టైలిష్‌గా కనిపించేందుకు నేటి యువత ఎన్నో తంటాలు పడుతున్నారు. ఫ్యాషన్ సెన్స్ బాగా పెరిగింది. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇక, కాలంతో పాటు ఫ్యాషన్‌లో కూడా పెద్ద మార్పు వస్తుంది. కొన్ని ఏళ్ల క్రితం ఫ్యాషన్ అనుకునే కొన్ని రకాల దుస్తులు ఇప్పుడు పాతవిగా మారి ఉండవచ్చు. ఎవరూ వాటిని ధరించడానికి ఇష్టపడకపోవచ్చు. సహజంగానే వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఫ్యాషన్ సెన్స్, గ్రూమింగ్ పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
అయితే, కాలక్రమేణా వార్డ్రోబ్లో కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి. అయితే, కొన్నిసార్లు లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఆరోగ్యానికి చాలా హానికరం కావచ్చు. అందుకే, ఏదైనా ఫ్యాషన్ ట్రెండ్‌ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా చూసుకోవాలి. అయితే, కొన్ని రకాల దుస్తులు ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయవచ్చు. ఈ దుస్తులు వేసుకోవడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఆ దుస్తులేంటి, అవి ఎందుకు వేసుకోకూడదో తెలుసుకుందాం.
చాలా టైట్‌గా ఉండే జీన్స్
'స్కిన్నీ జీన్స్' అని కూడా పిలువబడే టైట్ జీన్స్, టీనేజర్లలో ఒక ప్రధాన ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు అది మీకు ఎంత స్టైలిష్‌గా కనిపించినా, అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిజానికి, స్కిన్నీ జీన్స్ రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. స్కిన్నీ జీన్స్ కారణంగా శరీరంలో దిగువ భాగాలకు రక్త ప్రసరణ తగ్గవచ్చు. అంతేకాకుండా నరాల మీద అదనపు ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. దీని కారణంగా కాళ్ళలో నొప్పి సమస్య, గజ్జల్లో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో, ఈ మరీ టైట్‌గా ఉండే జీన్స్ పురుషులలో వంధ్యత్వానికి కూడా కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.
షేప్‌వేర్‌ను ఎక్కువగా వాడకండి
ఈ రోజుల్లో, మహిళల్లో షేప్ వేర్ ధరించే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇది ఒక రకమైన లోదుస్తులు. దీనిని ధరించడం వల్ల శరీర ఆకృతి చాలా మెరుగుపడుతుంది. నాజుగ్గా కనిపించేందుకు ఈ షేప్‌వార్‌ని ఎక్కువగా వాడుతున్నారు. ఏదైనా ఫంక్షన్ లేదంటే కొన్ని సందర్భాల్లో వీటిలో వాడితే తప్పులేదు. కానీ, వీటిని ఎక్కువ సార్లు వాడితే ఆరోగ్యానికి ప్రమాదమంటున్నారు నిపుణులు. షేప్‍వేర్ కడుపును లోపలికి నెట్టివేస్తుంది. దీని కారణంగా శరీరంలోని అంతర్గత భాగాలపై ఒత్తిడి కలుగుతుంది. అంతేకాకుండా స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరానికి సరైన ఆక్సిజన్ లభించదు. వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.
టైట్, లేస్ లోదుస్తులు
సాధారణంగా లేస్ లోదుస్తులు ఆకర్షిణీయం, అందంగా కనిపిస్తాయి. దీంతో, చాలా మంది ఈ లోదుస్తుల్ని వారి ఫ్యాషన్‌లో భాగం చేసుకుంటున్నారు. అయితే, లేస్ లోదుస్తులు గాలిని సరిగ్గా పీల్చుకోవు. దీంతో, తేమ ఎక్కువగా చేరుతుంటుంది. దీని కారణంగా యోని ఇన్ఫెక్షన్, యూటీఐ ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటితో పాటు బిగుతుగా ఉండే లోదుస్తులు కూడా అస్సలు మంచిది కాదు. ఎందుకంటే టైట్ లోదుస్తులు యోని ఇన్ఫెక్షన్ అవకాశాల్ని పెంచుతాయి. అంతేకాకుండా యోని చుట్టూ ఉన్న చర్మం రాపిడికి గురవుతుంది. చికాకు కూడా పెరుగుతుంది. అందుకే కాటన్‌తో చేసిన తేలికైన, వదులుగా ఉండే లోదుస్తుల్ని ఎంచుకోండి.
బిగుతుగా ఉండే దుస్తులు
అందరూ చక్కగా సరిపోయే దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. చాలా మంది ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. అది సాధ్యం కానప్పుడు ఫిట్‌గా కనిపించడానికి టైట్ షర్టులు, బాడీకాన్ డ్రెస్సులు, టాప్స్ వంటి దుస్తులు ధరిస్తున్నారు. అయితే, ఇవి టైట్‌గా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇలాంటి బట్టలు శరీరంలో రక్త ప్రసరణను నెమ్మదించేలా చేస్తాయి. కొన్నిసార్లు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధి కూడా రావచ్చు. టైట్ బట్టలు కడుపుపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీని కారణంగా యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.
సీక్విన్ వర్క్ దుస్తులు
మెరిసే, ఆకర్షణీయమైన సీక్విన్ వర్క్ డ్రెస్సులు ఎవరికి ఇష్టం ఉండవు? పార్టీల్లో అందంగా కనిపించేందుకు ఈ దుస్తులు బెస్ట్ ఆప్షన్. అయితే, సీక్విన్ వర్క్ ఉన్న బట్టలు ధరించడం ఆరోగ్యానికి మంచిది కాదు. నిజానికి, బిస్ ఫినాల్ ఎ, థాలేట్లను సీక్విన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రెండు పదార్థాలు హార్మోన్ల సమతుల్యతను భంగపరుస్తాయి. అంతేకాకుండా పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఇలాంటి దుస్తులు ధరించడం మానుకోవాలని నిపుణులు అంటున్నారు.
![]() |
![]() |