అర్ధరాత్రి 12 దాటింది. ప్రజలందరూ గాఢనిద్రలోకి జారుకున్నారు. ఇంతలో దూరంగా ఉన్న ఓ ఇంట్లో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. కుక్కలు, పిల్లులు శబ్దాలు చేసి ఉంటాయని స్థానికులు మొదట భావించారు. చాలా సేపు అవుతున్నా.. శబ్దాలు అలాగే రావటంతో భయంతో వణికిపోయారు. రాత్రి సమయంలో ఆ ఇంట్లోకి వెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోయారు. భయంతో పోలీసులకు సమాచారామిచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకింత భయంతోనే లోపలికి అడుగుపెట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. వారికి షాకింగ్ సీన్ కనిపించింది. ఇంట్లో ఓ మూల ఓ పెద్ద గొయ్యి కనిపించింది. అదేంటా.. అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని ఖిలావరంగల్ తూర్పుకోటకు చెందిన గోనెల శ్రీనివాస్ ఇంట్లో ఆదివారం (మార్చి 23) రాత్రి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. కొత్త వారు ఇంట్లోకి వెళ్లటంతో పాటుగా.. ఏవో పూజలు చేస్తున్నట్లు చుట్టుపక్కల వారు గమనించారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేదు. రెండో రోజు రాత్రి కూడా కొందరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లటం.. అర్ధరాత్రి తర్వాత ఇంటి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావటంతో స్థానికులు భయపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో అసలు గుట్టు బయటపడింది. ఇంట్లో ఓ మూలన పెద్ద గొయ్యి కనిపించింది. గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి యజమాని శ్రీనివాస్‌తోపాటుగా కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు హిజ్రాలు ముఠాగా ఏర్పడి కొద్ది రోజులగా ఇంట్లో ఈ తవ్వకాలు చేస్తున్నారని తేలింది. పోలీసులు అక్కడకు రావడాన్ని గమనించి కొంత మంది పరారయ్యారు. మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గుప్త నిధుల ఉన్నాయనే భ్రమతో ఇంట్లో తవ్వకాలు చేపట్టడమేంట్రా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
కాగా ఖిలావరంగల్ కోట ప్రాంతం ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ సంరక్షణలో నిషేధిత ప్రాంతంగా ఉంది. అక్కడ ఏ చిన్న తవ్వకాలు చేపట్టినా.. అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు పది మంది ఉన్న ఈ ముఠా గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో తవ్వకాలు చేపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక్కడ తవ్వకాలు చేపట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
![]() |
![]() |