గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మహిళ హత్య కలకలం రేపుతోంది. ఇదే ప్రదేశంలో సుమారుగా రెండు నెలల కిందట కూడా ఓ మహిళ హత్య కావటం కలకలం రేపుతోంది. తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఈ ఏడాది జనవరి 31న ఓ మహిళ మృతదేహం లభించింది. కొంతమంది దుండగులు ఓ మహిళను అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి జాతీయ రహదారి సమీపంలోని గుంటూరు కాలువ కట్ట పక్కనే పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. అయితే ఇప్పటికే ఆ కేసు విషయంలో నిందితుల ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు కావొస్తుండగా.. అదే ప్రాంతంలో ఇప్పుడు మరో మహిళ హత్యకు గురైంది.
మార్చి 23వ తేదీ రాత్రి కొలనుకొండ సమీపంలోని గుంటూరు కాలువ గట్టు పక్కన ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. కాలువ పక్కన ఉన్న తుమ్మచెట్ల మధ్య స్థానికులకు మహిళ మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో చనిపోయింది.. కృష్ణా జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళగా పోలీసులు గుర్తించారు. ఆ మహిళ భర్త పదేళ్ల కిందట చనిపోయాడని.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్ద ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అప్పుడప్పుడూ విజయవాడ రాణిగారితోటకు వస్తూ ఉంటుందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అయితే మహిళపై అత్యాచారం చేశారా అనే కోణంలో పోలీసులు తొలుత దర్యాప్తు జరిపారు. అయితే ఆ మహిళ ఓ వ్యక్తితో కలిసి అక్కడకు వెళ్లినట్లు ఓ హిజ్రా ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో మహిళతో కలిసి కాలువ గట్టు వద్దకు వచ్చిన వ్యక్తే హత్య చేశాడా.. లేదా మరెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. మరోవైపు తన కూతురు పెళ్లి పనులకోసం వెళ్తున్నానని చెప్పినట్లు మృతురాలి తల్లి చెప్తోంది. దీనిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఓ హిజ్రాను ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. తన వ్యాపారం దెబ్బతీస్తోందనే కోపంతోనే మరో వ్యక్తితో కలిసి హిజ్రా ఆ మహిళను హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
![]() |
![]() |