ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేగంగా బరువు తగ్గాలంటే ఏ వ్యాయామం మంచిదో తెలుసా

Life style |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 10:35 PM

ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో కూడుకుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. చాలా మంది వ్యాధులకు దూరంగా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే, చాలా మంది వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. కానీ, ఏ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో చాలా మందికి తెలియదు. కొంతమంది వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.


మరికొందరు మెట్లు ఎక్కడం బెస్ట్ అనుకుంటారు. అయితే, వాకింగ్ అయినా లేదా మెట్లు ఎక్కడం అయినా, రెండూ చాలా ముఖ్యమైనవి. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ వ్యాయామాల వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండూ దిగువ శరీరాన్ని బలోపేతం చేస్తాయి. కండరాలను టోన్ చేస్తాయి. చాలా మంది ఉదయం లేదా సాయంత్రం నడకకు వెళతారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే మెట్లు ఎక్కడం అనే ప్రత్యేక వ్యాయామం చేస్తారు. అయితే, బరువు తగ్గడానికి వాకింగ్ లేదా మెట్లు ఎక్కడం రెండింటిలో ఏది బెస్ట్ అన్న విషయం ఇక్కడ తెలుసుకుందాం.


మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు


* బరువు తగ్గాలనుకునేవారికి మెట్లు ఎక్కడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మెట్లు ఎక్కడం వల్ల 8.6 నుంచి 9.6 రెట్లు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో, బరువును నియంత్రించడంలో సాయపడుతుంది.


* ప్రతిరోజూ మెట్లు ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల హృదయ సంబంధమైన ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. దీంతో కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


* ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మెట్లు ఎక్కడం రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.


* ప్రతి రోజూ మెట్లు ఎక్కడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. రోజూ మెట్లు ఎక్కడం వల్ల లిపో ప్రోటీన్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది. దీంతో, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించుకుంటూ మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది.


* మెట్లు ఎక్కడం వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుంది. ఇది ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.


మెట్లు ఎక్కడం వల్ల నష్టాలు


మెట్లు ఎక్కడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ అది అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పలేం. ఉదాహరణకు, గుండె జబ్బులు ఉన్నవారు లేదా మోకాలి సమస్యలతో బాధపడేవారు మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు చేసే ముందు వైద్యుడిని సంప్రదించాలి. నిజానికి, మెట్లు ఎక్కడం వల్ల హృదయ స్పందన పెరుగుతుంది. ఇది సాధారణ వ్యక్తులకు మంచిది. కానీ, గుండె రోగులకు సమస్యలను కలిగిస్తుంది.


వాకింగ్


ఏ వయసు వారైనా సరే సులభంగా చేయగలిగే వ్యాయామం నడక. వాకింగ్ చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామం చేయాలనుకునేవారు, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలనుకునేవారికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ట్రెడ్ మీల్ ఉంటే ఇంట్లోనే వాకింగ్ చేసుకోవచ్చు. రోజూ ముప్పై నిమిషాలు నడవడం వల్ల 150 నుంచి 200 కేలరీల వరకు బర్న్ అవుతాయి. అంతేకాకుండా నడక వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.


వాకింగ్ వల్ల ప్రయోజనాలు


* గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది - క్రమం తప్పకుండా నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది .


* బరువు నియంత్రణ - నడక కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. అయితే, ఇది జాగింగ్ కంటే కొంచెం స్లో ప్రాసెస్


* కీళ్లకు సురక్షితం - నడక కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో మోకాలి లేదా వెన్ను నొప్పి సమస్యలు ఉన్నవారికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్.


* ఒత్తిడి నుంచి రిలీఫ్ - నడక మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సాయపడుతుంది.


రెండింటిలో ఏది బెస్ట్?


* రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలనుకుంటే అది వ్యక్తి ఫిట్‌నెస్ స్థాయి, ఆరోగ్యం, వారి జీవశశైలి ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.


* మెట్లు ఎక్కడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఇది మెరుగైన వ్యాయామం. కానీ, గుండె సమస్యలు, ఆస్తమా, మోకాలి నొప్పులతో బాధపడేవారికి ఇది సరైన వ్యాయామం కాదు.


* మీకు ఊబకాయం తప్ప ఇతర సమస్య లేకపోతే వాకింగ్ కన్నా మెట్లు ఎక్కడం బెస్ట్ ఆప్షన్. మెట్లు ఎక్కడం ద్వారా బరువు తగ్గవచ్చు. అయితే, ఇతర సమస్యలతో బాధపడేవారికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్.


* వాకింగ్ వల్ల ఫలితాలు స్థిరంగా ఉంటాయి. వాకింగ్ వల్ల బరువు తగ్గవచ్చు. రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. కానీ దీనికి సమయం పట్టవచ్చు.


* అయితే, వ్యాయామం స్టార్ట్ చేయాలనుకునేవారికి, కీళ్ల సమస్యలు, కాళ్ల నొప్పులు ఉన్నవారికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com