తన 2.0 పాలనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్ధమయ్యారు. ఇకపై ఓటు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ఆధారాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. కొత్త నిబంధనలకు సంబంధించి భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో ఎన్నికల ప్రక్రియను ఆయన ఉదాహరణగా పేర్కొనడం గమనార్హం. కొత్త నిబంధనల ప్రకారం.. అమెరికా పౌరుల కానివారు ఎన్నికలకు నిధులు ఇవ్వలేరు.
‘‘స్వయం పాలనలో ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలుస్తున్నాం.. అయినప్పటికీ. ఆధునిక, అభివృద్ధి చెందిన దేశాల ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక, అవసరమైన మార్గదర్శకాలను అమలు చేయడంలో అమెరికా విఫలమైంది. ఉదాహరణకు.. భారత్ (India), బ్రెజిల్ వంటి దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తున్నాయి. కానీ, పౌరసత్వం కోసం అమెరికా స్వీయ ధ్రువీకరణపై మాత్రమే ఆధారపడుతోంది.జర్మనీ, కెనడా వంటి దేశాలు ఓట్ల లెక్కింపులో పేపర్ బ్యాలెట్ల విధానం అమలుచేస్తున్నాయి.. అమెరికా ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి’’ అని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై అమెరికన్లు ఓటు నమోదుకు తప్పనిసరిగా తమ పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది. అంటే అమెరికా పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికెట్ ఏదో ఒకటి చూపించాలి. ఇక, ఎన్నికల విరాళాలు విషయంలో ట్రంప్ మార్పులు చేశారు. అమెరికా పౌరులు కానివారు విరాళం ఇవ్వకుండా నిషేధం విధించారు. అంతేకాదు, పోలింగ్ రోజుకి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఇందుకు డెన్మార్క్, స్వీడన్ వంటి ఐరోపా దేశాలను ట్రంప్ ఉదాహరణగా చూపారు. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల పోలింగ్ రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్ లేదా మొయిల్ ఓట్లను కూడా అనుమతిస్తున్నారు. అలాగే, ‘జర్మనీ, కెనడా ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకుంటాయి.. కానీ, అమెరికాలో ఎటువంటి సురక్షితం కాని విధానాలను అమలు చేస్తోంది’ అని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
![]() |
![]() |