ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో ఇటీవలే ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న నేవీ ఆఫీసర్‌ను హత్య చేసింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను చంపి 15 ముక్కలు చేసింది. ఆపై దాన్ని ఓ డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో సీల్ చేసింది. ఎట్టకేలకు విషయం గుర్తించిన పోలీసుల నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే ఈ దారుణాన్ని మరవకముందే.. ఇలాంటిదే మరొకటి జరిగింది. ఇది కూడా మీరట్లోనే కాగా అంతా ఆశ్చర్యపోతున్నారు.
మార్చి 5వ తేదీన ఔరోయాకు చెందిన దిలీప్.. అందమైన, తన మనసుకు నచ్చిన ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే ప్రగతి అదే గ్రామానికి చెందిన అనురాగ్ యాదవ్‌ను ప్రేమించింది. అతడు కూడా ఈమెను ప్రేమించగా.. నాలుగేళ్ల పాటు కలిసి చెట్టూ పుట్టా తిరిగారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ప్రగతి దిలీప్‌ను పెళ్లి చేసుకుంది.
అత్తారింటికి వెళ్లిన తర్వాత నుంచి ప్రగతికి ప్రియుడు అనురాగ్ యాదవ్ గుర్తుకు రాగా.. అతడిని కలిసేందుకు ప్రయత్నించింది. కానీ కొత్తగా పెళ్లవడం, అందులో భర్త పక్కనే ఉండడంతో కుదరలేదు. దీంతో ప్రియుడికి ఫోన్ చేసి భర్తతో ఉండనని.. నాకు నువ్వే కావాలంటూ వివరించింది. కానీ పారిపోతే బాగుండదని.. అందుకే భర్తను చంపేస్తే తమ సమస్య తీరిపోతుందని చెప్పింది. ఇందుకు అనురాగ్ కూడా ఒప్పుకోగా.. దిలీప్ హత్యకు కుట్ర చేశారు. వాళ్లే చంపేస్తే దొరికిపోతామని.. కాంట్రాక్ట్ కిల్లర్‌కు సుపారీ ఇవ్వాలనుకున్నారు.
తెలిసిన వాళ్ల ద్వారా కాంట్రాక్ట్ కిల్లర్ రామ్‌జీ వివరాలు తెలుసుకుని అనురాగ్ యాదవ్, ప్రగతిలు అతడి వద్దకు వెళ్లారు. దిలీప్‌ను చంపమని చెప్పి.. 2 లక్షలు సుపారీ ఇస్తామన్నారు. అయితే అనురాగ్ వద్ద అన్ని డబ్బులు లేకపోవడంతో.. ప్రగతి తన పెళ్లికి బహుమతులుగా వచ్చి బంగారాన్ని అమ్మేసి తన వద్ద ఉన్న మరికొన్ని డబ్బులు అందులో కలిపి 2 లక్షలు సిద్ధం చేసింది. ఆపై రామ్‌జీకి ఆ డబ్బులు ఇవ్వగా.. మార్చి 19వ తేదీ రోజున దిలీప్ హత్యకు కుట్ర పన్నారు. ప్లాన్ ప్రకారమే ప్రగతి.. దిలీప్‌ను పొలాల్లోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడకు చేరుకున్న రామ్‌జీ, అనురాగ్ యాదవ్‌లు.. దిలీప్‌పై దాడి చేసి తుపాకులతో కాల్చి చంపారు.
ఆపై ఏమీ తెలియనట్లు అంతా వెళ్లిపోగా.. స్థానిక ప్రజలు దిలీప్ మృతదేహాన్ని గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తులో భాగంగా.. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అప్పుడే భార్యతో వెళ్లినట్లు గుర్తించి తమదైన స్టైల్లో విచారించగా ప్రగతి అసలు విషయం చెప్పేసింది. దీంతో ప్రగతి, అనురాగ్ యాదవ్, రాంజీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్సు, ఆధార్ కార్డు, రూ.3,000 స్వాధీనం చేసుకున్నారు.
![]() |
![]() |