విశాఖపట్నంలో ఓ మహిళ భవనంపైకి ఎక్కేసింది.. కిందకు దూకేస్తానంటూ బెదిరింపులకు దిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కిందకు దిగి రావాలని ఆమెను కోరారు.. ఆమె మాత్రం రాలేదు. చివరికి పోలీసులు పైకి వెళ్లి ఆమెను మాటల్లో ఉంచి పైకి లాగడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఇంతకీ బిల్డింగ్‌పైకి ఎందుకు ఎక్కావమ్మా అని అడిగితే.. ఆమె చెప్పిన కారణంతో అందరూ అవాక్కయ్యారు. ఆ చిన్ని కారణానికి భవనంపైకి ఎక్కావా తల్లి అనుకుంటూ అందరి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విశాఖపట్నం కొమ్మాది వైఎస్సార్ కాలనీలోని బ్లాక్ నెం-24, టీఎఫ్-1లో తాపీమేస్త్రి ఒబ్బిన వెంకటరమణ, భార్య సూరి కుమార్తెతో కలిసి ఉంటున్నారు. గురువారం ఉదయం తనకు రూ.500 కావాలని భార్య సూరి భర్త వెంకటరమణను అడిగింది. ఆయన తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్తపై కోపంతో ఉదయం 11.30 గంటల సమయంలో.. వారు ఉంటున్న బ్లాక్ మూడో అంతస్తుపైకి వెళ్లి పిట్టగోడ ఎక్కి కిటికీపై ఉన్న సన్‌షేట్ మీదికి దిగింది. అక్కడ నుంచి దూకేస్తానని బెదిరింపులకు దిగింది. దాదాపు గంటకుపైగా అక్కడే కూర్చోగా.. స్థానికులు అక్కడికి వచ్చి ఆమెకు నచ్చజెప్పి కిందకు దిగి రావాలని కోరారు.. ఆమె మాత్రం ఒప్పుకోలేదు.
వెంటనే సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మూడో అంతస్తు పిట్టగోడ దగ్గర నిలబడి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలా మెల్లిగా మాటల్లో పెట్టి చాకచక్యంగా ఆమెను పైకి లాగారు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. ఆమెను కిందకు తీసుకొచ్చారు. భవనంపైకి ఎక్కడానికి కారణం ఏంటని అడిగితే తన భర్తతో రూ.500 విషయంలో గొడవపడినట్లు చెప్పారు. ఆ వెంటనే భార్యాభర్తలను పిలిచిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మహిళను తెలివిగా రక్షించిన స్థానిక ఎస్సై భాస్కర్‌ను నార్త్‌సబ్ పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. మొత్తం మీద భర్తతో జరిగిన చిన్న గొడవతో ఆమె భవనంపైకి ఎక్కి అందర్నీ కంగారుపెట్టింది.
![]() |
![]() |