మయన్మార్‌ను భూకంపాలు వెంటాడుతూనే ఉన్నాయి. శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 1600 మందికిపైగా ప్రాణాలను బలితీసుకుంది. తాజాగా మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఏకంగా మూడు భూకంపాలు మయన్మార్ ప్రజలను భయపెట్టాయి. ఉదయం 11.53 గంటలకు 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో, 20 నిమిషాల అనంతరం 4.7 తీవ్రతతో మరో భూకంపం ప్రజలను భయపెట్టింది.శుక్రవారం నాటి భూకంపం కారణంగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న హైరైజ్ భవనం కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 78 కార్మికుల జాడ ఇంకా తెలియరాలేదు. నగరంలో చనిపోయిన మరో 10 మందిని నిన్న గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
![]() |
![]() |