ఉగాది రోజున ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మడకశిర పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్వర్ణకారుడు కృష్ణమాచారి (55), భార్య సరళమ్మ, వారి ఇద్దరి కుమారులు సంతోష్, భువనేశ్ తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం కృష్ణమాచారి ఇంటికి ఆయన తండ్రి వచ్చినప్పుడు ఈ ఘటన వెలుగుచూసింది. ఆయన ఇతర బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆ నలుగురు అత్యంత ప్రాణాంతక విషం సైనైడ్ సేవించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమారులకు విషం ఇచ్చి, ఆపై కృష్ణమాచారి, సరళమ్మ కూడా విషం తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు తోడు, కుటుంబ పరమైన సమస్యలు కూడా వారి బలవన్మరణాలకు దారితీసి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
![]() |
![]() |