మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. ఉండవల్లిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు ఉచితంగా శాశ్వత గృహ పట్టాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా, 15 సంవత్సరాలుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి స్వయంగా వారి ఇంటికి వెళ్లి కొత్త బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు 'పట్టా'భిషేకం చేస్తున్నామని, ముఖ్యమైన హామీని నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అటవీ, దేవాదాయ, రైల్వే, ఇరిగేషన్ భూముల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల కష్టాలను చూశానని, వారికి శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించానని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు మూడు విడతలుగా శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని, మొదటి విడతలో 150 గజాల్లోపు ఉంటున్న 3 వేల మందికి పట్టాలు ఇస్తున్నామని, రెండో విడతలో ఎండోమెంట్స్, రైల్వే భూముల్లో నివసించేవారికి, మూడో విడతలో మిగిలిన వారందరికీ పట్టాలు అందజేస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
![]() |
![]() |