ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్‌పై సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సలహా మండలిలో గేట్స్ ఫౌండేషన్ నుంచి, అలాగే మద్రాసు ఐఐటీ, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులను సభ్యులుగా నియమించాలన్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా, సుపరిపాలన అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు.ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్‌లైన్, డిజిటల్, వాట్సాప్ గవర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోను ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకుని ప్రజలు సేవలు పొందేలా అవగాహన కల్పించడంతో పాటు వాట్సప్ గవర్నెన్స్‌ను మరింత విస్తృత పరిచేలా చూడాలని ఆదేశించారు. జూన్ 12 కల్లా ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించగలిగే సేవలన్నిటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఆర్టీజీఎస్‌లో డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.మొత్తం 500 సేవలు వరకు వాట్సప్ ద్వారా అందించేందుకు వీలుందని, అయితే ప్రస్తుతం 254 సేవలు వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువచ్చామని.. వెయ్యికి పైగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐటీ, ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి వివరించారు.
![]() |
![]() |