వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను దిక్కు తోచని స్థితిలోకి నెట్టివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని చెప్పారు. దాంతో, కేబినెట్ లో మంత్రి నారా లోకేశ్ తో చర్చించే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. వాలంటీర్లకు గత ప్రభుత్వం జీతాలు ఎలా ఇచ్చిందో కూడా తెలియడం లేదని... జీతాలు ఎలా ఇచ్చారో వాలంటీర్ నాయకులను అడిగి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. డుంబ్రిగూడ మండలం కురిది గ్రామం రచ్చబండలో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి మాయ చేశారని... రూ. 25 వేల కోట్లు దోచేశారని పవన్ మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్లను తీసుకుంటున్నామని చెప్పి... పార్టీ కోసం పని చేయించుకున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన డాక్యుమెంట్ కానీ, జీవో కానీ ప్రభుత్వం దగ్గర లేదని... రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టు అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అందుకే కేబినెట్ లో వాలంటీర్ల గురించి మాట్లాడటానికి ఎలాంటి అవకాశం కనిపించడం లేదని చెప్పారు.
![]() |
![]() |