బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తారు. బంగారం ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి కాసులు కురుస్తున్నాయి. అయితే బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా రకాల పద్ధతులు ఉంటాయి. నేరుగా భౌతిక బంగారం కొనడమే కాకుడా డిజిటల్ విధానంలో కొనుగోలు చేయవచ్చు. ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ కోవకు చెందిన ఓ గోల్డ్ ఈటీఎఫ్ పథకం అద్భుతం చేసింది. రూ.10 వేల నెలవారి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడిని ఏకంగా రూ.68 లక్షలు చేసింది. ఆ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చిన నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఇఈఎస్ ఫండ్ రూ.10 వేల సిప్ పెట్టుబడిని గడిచిన 18 సంవత్సరాల కాలంలో ఏకంగా రూ.67.59 లక్షలు చేసింది. ఈ పథకం లాంచ్ అయినప్పటి నుంచి చూసుకుంటే స్కీమ్ సిప్ రిటర్న్స్ 11.51 శాతంగా ఉంది.
ఒకేసారి రూ.1 లక్ష పెడితే రూ.8 లక్షలు
నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఇఈఎస్ ఫండ్లో నెల నెలా ఇన్వెస్ట్ చేయకుండా ఒకేసారి లంప్సమ్ పెట్టుబడి పెట్టిన వారికి సైతం హైరిటర్న్స్ అందాయి. ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడు ఇందులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఆ విలువ రూ.8.04 లక్షలు అవుతుంది. ఈ స్కీమ్ వార్షిక రిటర్న్స్ 12.22 శాతంగా ఉన్నాయి.
నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ స్కీమ్ గత ఏడాది కాలంలో చూసుకుంటే ఏకంగా 33.63 శాతం మేర లాభాలు అందించింది. అలాగే గత 9 నెలల పని తీరు గమనిస్తే ఏకంగా 25.75 శాతం రిటర్న్స్ అందించింది. గత ఆరు నెలల కాలంలో 19.89 శాతం చొప్పున లాభాలు ఇచ్చింది. ఈ పథకాన్ని మార్చి, 2007లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడులు రూ. 18,779 కోట్లు ఉన్నాయి.
![]() |
![]() |