ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడైన రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ జట్టులో తన పాత్ర అనేక సీజన్లుగా ఎలా మారిందో వివరించాడు. జట్టును విజయపథంలో నడిపించడం నుంచి కొత్త పాత్రలకు అలవాటు పడడం వరకు తన అనుభవాలను పంచుకున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున తాను ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి చాలా మార్పులు జరిగాయని, అయితే ముంబయి ఇండియన్స్ కోసం మ్యాచ్ లను, ట్రోఫీలను గెలవాలనే తన అభిరుచి, కోరిక ఎప్పుడూ మారలేదని స్పష్టం చేశాడు. అప్పటికీ, ఇప్పటికీ ఆ విషయంలో తన మైండ్ సెట్ అలాగే ఉందని అన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ తన కెరీర్ లోనే అత్యంత పేలవంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ లో మొదటి మూడు మ్యాచ్‌లలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా విఫలమై 8 పరుగులు మాత్రమే చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ సబ్‌గా వచ్చి 13 పరుగులు చేశాడు.జియోహాట్‌స్టార్‌లో ‘చర్చ విత్ రోహిత్ శర్మ’ ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. "నేను ఒకప్పుడు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడిని. ఇప్పుడు ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. గతంలో నేను కెప్టెన్‌గా ఉండేవాడిని, ఇప్పుడు సాధారణ ఆటగాడిని మాత్రమే. గతంలో ముంబయి ఇండియన్స్ తరఫున ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్టులోని కొంతమంది సహచరులు ఇప్పుడు కోచింగ్ పాత్రల్లో ఉన్నారు. పాత్రలు మారాయి, చాలా మార్పులు వచ్చాయి, కానీ నా మనస్తత్వం మాత్రం మారలేదు. ఈ జట్టు కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో ఆ దృక్పథం మారలేదు. ఎలాంటి అవకాశం లేదు అనుకున్న పరిస్థితుల్లోనూ మ్యాచ్ లు నెగ్గాం, ట్రోఫీలు గెలిచాం... ముంబయి ఇండియన్స్ అంటే అదే" అని స్పష్టం చేశాడు.
![]() |
![]() |