ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ కలిసిరావడం లేదు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. అది కూడా సొంతగడ్డపైనే. 184 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో సీఎస్కే విఫలమైంది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విజయ్ శంకర్ 54 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఎంఎస్ ధోనీ 26 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. పెరిగిపోతున్న రన్ రేట్ ను అందుకోవడంలో విజయ్ శంకర్, ధోనీ విఫలమయ్యారు. వీరిద్దరూ క్రీజులోనే ఉన్నప్పటికీ భారీ షాట్లు కొట్టలేక చెన్నై అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. చెన్నై ఇన్నింగ్స్ చూస్తే ఓపెనర్లు రచిన్ రవీంద్ర 3, డెవాన్ కాన్వే 13, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు చేసి అవుటయ్యారు. శివమ్ దూబే (18), రవీంద్ర జడేజా (2) స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ 2, మిచెల్ స్టార్క్ 1, మహేశ్ కుమార్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది వరుసగా మూడో విజయం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో నెగ్గి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో చెన్నై జట్టు ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి కేవలం 1 మ్యాచ్ లోనే గెలిచింది.
![]() |
![]() |