ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసేలా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాబోయే ముంబయి ఇండియన్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బుమ్రా జట్టులో చేరాడని ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది. ఎంఐ ఫ్యాన్స్ కు ఇది నిజంగా పూనకాలు తెచ్చే వార్తే. ఎందుకంటే, ఈ ఐపీఎల్ సీజన్ లో సరైన స్ట్రయిక్ బౌలర్ లేక ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడితే, అందులో మూడింట్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో, బుమ్రా తిరిగొచ్చాడన్న వార్త అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేస్తూ ప్రకటించింది. "గర్జించడానికి సిద్ధం" అనే క్యాప్షన్‌తో వీడియోను పంచుకుంది. బుమ్రా తిరిగి రావడం ముంబయి ఇండియన్స్‌కు ఎంతో ఊరటనిచ్చే అంశం. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుమ్రా పునరాగమనానికి మార్గం సుగమం అయింది. బుమ్రా రాకతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం మరింత బలోపేతం అవుతుంది. బుమ్రా రాకతో జట్టుకు ఒక కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు. బుమ్రా తన కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయగలడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటూ జట్టుకు విజయాలు అందించగల సత్తా ఈ రైటార్మ్ పేసర్ సొంతం. ముంబయి ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో రేపు వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో బుమ్రా ఎలాంటి ప్రభావం చూపిస్తాడన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
![]() |
![]() |