దేవుడు తనను ఏదో ఒక కారణం చేత ఇంకా బతికించాడని, త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. ఆమె సోషల్ మీడియా వేదికగా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవామీ లీగ్ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆమె హెచ్చరించారు. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో ఉండాలని అన్నారు.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు ప్రజలంటే ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన తీరును అర్థం చేసుకోలేకపోయామని తెలిపారు. అతడికి బంగ్లాదేశ్ ఎంతో చేసిందని అన్నారు. యూనస్ వల్ల దేశానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.ఆయన సారథ్యంలో బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారిందని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు. మీడియాకు చెందిన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో ఈ నేరాలు బయటకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు సహా తన కుటుంబం మొత్తం హత్యలకు గురైందని ఆమె ఆక్రోశించారు. నా ద్వారా బంగ్లా ప్రజలకు మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకున్నాడేమోనని, అందుకే తనను రక్షిస్తున్నాడని అన్నారు.
![]() |
![]() |