భారత్ తో ప్రత్యేకమైన స్నేహబంధం ఉందంటూనే ఉక్రెయిన్ లోని భారత ఫార్మా గిడ్డంగిపై రష్యా దాడి చేసిందని ఆ దేశ రాయబారి ఆరోపించారు. శనివారం ఉదయం కీవ్ నగరంలోని ప్రముఖ ఫార్మా సంస్థ ‘కుసుమ్’ గోడౌన్ ను టార్గెట్ చేసి మరీ క్షిపణి దాడి చేసిందన్నారు. ఈ దాడిలో గోడౌన్ మొత్తం నాశనమైందని ఆయన వివరించారు. చిన్న పిల్లలు, వృద్ధులకు అవసరమైన మందులు నిల్వ చేసిన గిడ్డంగి పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక్కటే కాదు.ఉక్రెయిన్ లోని భారత వ్యాపార సంస్థలను టార్గెట్ చేసి రష్యా దాడులు చేస్తోందని ఆరోపించారు.ఈ దాడికి సంబంధించి ఉక్రెయిన్ లోని బ్రిటన్ రాయబార కార్యాలయం కూడా ఓ ట్వీట్ చేసింది. కీవ్ నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ గిడ్డంగిపై రష్యా దాడి చేసిందని, అయితే అది క్షిపణి దాడి మాత్రం కాదని వివరించింది. రష్యా డ్రోన్లు ఫార్మా గోడౌన్ పై దాడి చేశాయని పేర్కొంది. గోడౌన్ లో చిన్నారులకు, వృద్ధులకు అత్యవసరమైన మందులు నిల్వ చేసినట్లు తెలిపింది. కాగా, ఉక్రెయిన్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీలలో ఒకటైన కుసుమ్ ఫార్మా యజమాని భారత్ కు చెందిన రాజీవ్ గుప్తా అని అధికార వర్గాల సమాచారం. గోడౌన్ పై దాడికి సంబంధించి రాజీవ్ గుప్తా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
![]() |
![]() |