26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. విచారణ నిమిత్తం కోర్టు రాణాకు కస్టడీ విధించింది. ఈక్రమంలోనే ఎన్ఐఏ అధికారులు అతడిని విచారిస్తున్నారు. అతి చిన్న సెల్ లో ఉంచి 12 మంది అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలోనే తహవూర్ రాణాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయనకు 33 రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా రాణా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోందని.. అతడికి పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వీటితో పాటు కిడ్నీ సమస్యలు, టీబీ, సైనస్, బ్రాంకోటైస్, ఆస్తమా సహా పలు రకాల సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు తహవూర్ రాణా చాలానే ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా తన న్యాయవాది సాయంతో అమెరికా ప్రభుత్వానికి అనేక అబద్ధాలు చెప్పించాడు. కానీ ట్రంప్ సర్కారు మాత్రం అవేవీ పట్టించుకోకుండా తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించింది. ఈ కుంటిసాకుల్లో భాగంగానే ఈ ఏడాది జనవరి 21వ తేదీన రాణా న్యాయవాది జాన్ డి క్లైన్ అమెరికా విదేశాంగశాఖ అధికారులకు ఓ లేఖ రాశాడు. ఆ లేఖలోనే రాణాకు 33 రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వివరించారు. ఆయన్ను భారత్‌కు అప్పగిస్తే అక్కడ చిత్రహింసలకు గురవుతాడని పేర్కొన్నారు. భారత్ జైళ్లలోనే రాణా చనిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.
మరణశిక్షణను ఎదుర్కోవడం కోసం భారత్‌కు అప్పగిస్తే.. తహవూర్ రాణాను తీవ్రమైన టార్చర్ పెడతారని, ఆయన ఓ పాకిస్థానీ కావడమే అందుకు కారణం అంటూ లేఖలో న్యాయవాది రాసుకొచ్చారు. భారత దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన 26/11 ముంబై ఉగ్రదాడితో తహవూర్ రాణా పేరును ముడిపెట్టడం కూడా అతడిని చిత్రహింసలు పెట్టడానికి కారణంగా చూస్తారని అన్నారు.
గత కొన్నేళ్లుగా రాణా ఆరోగ్యం క్షీణిస్తోందని, గత ఐదేళ్ల నుంచి పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు. లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటిన్ కారాగారంలో ఉన్నాడని, అతడికి పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్లు 2024లో గుర్తించినట్లు లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు రాణా జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలతో కూడా బాధ పడుతున్నాడని అన్నారు. మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నాయని, రాణా మూత్రాశయంలో ఓ కండరం పెరుగుతోందని, అది క్యాన్సర్ అనే అనుమానం కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కిడ్నీ సమస్యలు, టీబీ, సైనస్, బ్రాంకోటైస్, ఆస్థమా, థైరాయిడ్ సమస్యలు, వినికిడి సమస్యలు ఇలా పలు 33 రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాణాను భారత్‌కు అప్పగిస్తే, అక్కడి జైళ్లలో పరిస్థితి మరింత ఘోరంగా మారవచ్చని లేఖలో రాణా న్యాయవాది పేర్కొన్నారు.
తహవ్వుర్ రాణా న్యాయవాది లేఖను అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. రాణాను కచ్చితంగా భారత్‌కు అప్పగిస్తామని, వారెంట్ ప్రకారం రాణాను ఎప్పుడైనా భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో లేఖపై స్పందిస్తూ చెప్పారు. అలాగే భారత్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తుందని, జైళ్లలో చిత్ర హింసల నిరోధానికి ఐరాస చట్టంపై సంతకం చేసిందని వెల్లడించారు.
![]() |
![]() |