మయన్మార్‌లో ఆదివారం ఉదయం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో మయన్మార్‌లో భూకంపం సంభవించినట్టు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. మావో హంగ్ సన్ ప్రావిన్సులకు వాయువ్యంగా 270 కిలోమీటర్ల్ దూరంలో భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 35 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. ఇటీవల మయన్మార్‌లో మార్చి 28న సంభవించిన భారీ భూకంపం సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వరుస ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కాగా, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ మాత్రం మయన్మార్‌లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు తెలిపింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. మార్చి 28న సంభవించిన భూకంపంలో భారీ ఆస్తి, ప్రాణనష్టం నష్టం జరిగింది. 4 వేల మందికి పైగా చనిపోగా.. వేలాది మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిధిలాల కింద చిక్కుకున్నవారు నాలుగైదు రోజుల తరువాత సైతం కొందరు ప్రాణాలతో బయటపడ్డ వీడియోలు వైరల్ అయ్యాయి.
తాజాగా మరోసారి భూకంపం రావడంతో ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నారు. గత రెండు వారాలుగా వారికి కంటిమీద కునుకు కరవయ్యింది. మార్చి 28 నుంచి ఇప్పటి వరకూ మయన్మార్ పరిసర ప్రాంతాల్లో 468కిపైగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు భూకంప కేంద్రాల్లో రికార్డయ్యింది. శుక్రవారం కూడా రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం రావడంతో ఇంకా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
కాగా, గత నెలలో సంభవించిన భూకంపంతో మౌలిక సదుపాయాలు, వంతెనలు కూలిపోవడం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. భారీ యంత్రాలు సాయం లేకుండానే స్థానికులు.. ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగించారు.
మరోవైపు, మయన్మార్‌ను ఆదుకున్న భారత్.. సహాయక చర్యల కోసం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది. దీని ద్వారా బాధితులకు ఆపన్న హస్తం అందిస్తోంది. క్షతగాత్రులకు వైద్య సహాయం అందించింది. ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్‌లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు., భారత బృందాలు నేపిటా, మండలేలలోని శిబిరాలను ఏర్పాటు చేసింది. సగాయింగ్ ఫాల్ట్’కు సమీపంలో మయన్మార్ ఉండటం వల్ల తరుచూ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్ టెక్టానిక్ ప్లేట్, మయన్మార్ మైక్రోప్లేట్‌ల మధ్య ఉండే సగాయింగ్ ఫాల్ట్ దాదాపు 1200 కి.మీల మేర విస్తరించిందని, ఒత్తిడి కారణంగా ఇక్కడ భూకంపాల ముప్పు అధికమని తేల్చారు.
![]() |
![]() |