భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో తనదే కీలక పాత్ర అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ స్పందించారు. ట్రంప్ మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇది ఆయనకు పరిపాటిగా మారిన ధోరణి అని రూబిన్ వ్యాఖ్యానించారు.ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మైఖేల్ రూబిన్ మాట్లాడుతూ, "డొనాల్డ్ ట్రంప్ ప్రతివిషయంలోనూ ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన్ను అడిగితే ప్రపంచకప్ గెలిచానని, ఇంటర్నెట్ కనుగొన్నానని, చివరికి క్యాన్సర్‌ను నయం చేశానని కూడా చెబుతారు. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలోనూ ఆయన అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ విషయంలో అమెరికన్లు ఎలాగైతే ఆయన మాటలను తేలిగ్గా తీసుకుంటారో, భారతీయులు కూడా అలాగే చూడాలి అని సూచించారు.భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారీ, తెరవెనుక అమెరికా మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తూనే ఉందని రూబిన్ గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదరకుండా నిరోధించడానికి దౌత్యపరమైన చర్చలు జరుపుతుందని ఆయన వివరించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లతో వాషింగ్టన్ నిరంతరం సంప్రదింపులు జరిపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.భారత్-పాకిస్థాన్ మధ్య ఈ నెల 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి, ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే, ఆ ఒప్పందం తన చొరవ వల్లే సాధ్యమైందని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ఇటీవల సౌదీ అరేబియా పర్యటనలో కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్‌ల మధ్య అణుయుద్ధం సంభవించకుండా తన మధ్యవర్తిత్వం ఎంతగానో దోహదపడిందని అన్నారు. ఉద్రిక్తతలు మరింత తగ్గడానికి ఇరుదేశాలు కలిసి ఓ మంచి విందు ఏర్పాటు చేసుకోవాలని కూడా ట్రంప్ సూచించారు. ఈ శాంతి ప్రక్రియలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాలుపంచుకున్నారని ట్రంప్ వారిని ప్రశంసించారు.
![]() |
![]() |