ఐపీఎల్ రీస్టార్ట్ కానున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "ఒక్క అవకాశం కావాలి (Need a break)" అంటూ ఈ టాలెండ్ ప్లేయర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు షాను ఏదో ఒక ఫ్రాంచైజీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీని వీడిన విదేశీ ఆటగాళ్లు కొంతమంది ఇప్పుడు పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం తిరిగి ఇండియాకు రావడానికి విముఖత చూపుతున్నారు. వారి స్థానంలో ఇతడిని తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, గతేడాది నవంబర్ లో జరిగిన మెగా వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాని విషయం తెలిసిందే. రూ. 75లక్షల బేసిక్ ప్రైస్‌కు కూడా అతడు అమ్ముడు పోలేదు. అతని ఫామ్, ఫిట్‌నెస్, క్రమశిక్షణ లేకపోవడం వంటివి అతని కెరీర్‌పై ప్రభావం చూపించాయి. ఆఖరికి ముంబయి రంజీ జట్టులో కూడా మనోడు చోటు కోల్పోవడం గమనార్హం. ఇక, గత ఏడాది డిసెంబర్‌లో సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీలో చివరిసారిగా పృథ్వీ షా ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు వీలైనంత త్వరగా తిరిగి ఆటలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐపీఎల్ పునఃప్రారంభం సందర్భంగా ఆశతో ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. మరి చూడాలి విదేశీ ఆటగాళ్ల రీప్లేస్‌మెంట్‌లో ఏదైనా ఐపీఎల్ ఫ్రాంచైజీ అతడిని తీసుకుంటుందేమో.
![]() |
![]() |