ఇంటిని శుభ్రం చేసే కర్ర తమ ఇంటి సంధులో పడిపోవడంతో దానిని తీసుకోడానికి ప్రయత్నించిన ఓ మహిళ.. ప్రమాదవశాత్తూ ఆ గోడల మధ్య ఇరుక్కుపోయింది. బయటపడేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో కాపాడమంటూ పెద్దగా కేకలు వేసింది. దీనిని గమనించిన స్థానికులు.. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. వారు విఫలం కావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు గంటల పాటు శ్రమించి ఆమెను బయటకు తీసుకొచ్చారు. విస్తుగొలిపే ఈ సంఘటన తమిళనాడు రాజధాని నగరం చెన్నై సమీపంలోని మణలిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నగరం మణలి కామరాజర్ వీధిలో నివాసం బొమ్మి (60) అనే వృద్ధురాలు.. తన బంధువులతో కలిసి ఉంటోంది. అవివాహిత అయిన ఆమె.. శనివారం తన బంధువులంతా శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుపతి వెళ్లడంతో ఆమె ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలో ఇంటి పైకప్పును ఆమె శుభ్రం చేస్తుండగా.. రెండు ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీలో కర్ర పడిపోయింది. దానిని తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్లిన ఆమె.. పొరపాటున అందులో ఇరుక్కున్నారు. బయటకు రాలేకపోయి పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న పొరుగువారు రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం విఫలమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మణలి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని ఘటన స్థలానికి చేరుకున్నారు. చ
మూడు గంటల పాటు అగ్ని మాపక సిబ్బంది కృషి చేసి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఆమె ముఖం, వెన్నెముక వంటి భాగాలలో స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆ మహిళను తరలించారు. ఈ సంఘటన మణలి పరిసరాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆమె ఇరుక్కున్న చోటు చాలా పొడవుగా ఉండటంతో,బయటకు తీయడం సవాలుగా మారిందని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఈ సంఘటన ఇళ్ల మధ్య ఖాళీలకు సంబంధించిన భద్రతను అనుసరించాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
![]() |
![]() |