ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండిగో పైలట్ రిక్వెస్ట్‌ తిరస్కరించిన పాక్

national |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 07:52 PM

ఉత్తరాది రాష్ట్రాలను మే 21న అకాల వర్షాలు వణికించాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం హఠాత్తుగా సంభవించిన గాలివానతో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. శ్రీనగర్ సమీపానికి విమానం చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా వడగండ్ల వర్షం మొదలైంది. దీంతో పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరుతూ లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఇండిగో పైలట్ రిక్వెస్ట్ చేశాడు. కానీ పాక్ ఈ విజ్ఞప్తిని తిరస్కరించినట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. విమానం అమృతసర్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విజ్ఞప్తి చేశారు. కానీ అనుమతి లభించకపోవడంతో విమానం తన అసలైన మార్గంలోనే ప్రయాణించాల్సి వచ్చింది. పహల్గామ్ ఘటన తర్వాత నెలకున్న ఉద్రిక్తతలతో భారత విమానాలకు గగనతలాన్ని పాకిస్థాన్ మూసివేసిన విషయం తెలిసిందే.


తుఫాన్ కారణంగా విమానానికి ముందు భాగం దెబ్బతింది. న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తోన్న 6E2142 ఇండిగో విమానంలో 227 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రతికూల వాతావరణంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


విమానం శ్రీనగర్‌కు చేరుకునే సమయానికి పైలట్ ఎమర్జెన్సీని ప్రకటించారు. దీంతో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ, చివరకు విమానాన్ని పైలట్ సురక్షితంగా శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అప్పటికే దాని ముందు భాగం దెబ్బతింది. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులు, సిబ్బంది అందర్నీ సురక్షితంగా దింపి.. విమానాన్ని తక్షణ మరమ్మతుల కోసం ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్’గా ప్రకటించారు.


ఘటనపై ప్రకటన చేసిన ఇండిగో.. ‘‘ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్లిన విమానం ఆకస్మికంగా తుఫాను ఎదుర్కొన్నదని, కానీ విజయవంతంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది’’ అని తెలిపింది. ‘ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులందరినీ పరామర్శించాం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం విమానానికి శ్రీనగర్‌లో తనిఖీలు, మరమ్మతులు కొనసాగుతున్నాయి.. అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాత మళ్లీ సేవలు పునఃప్రారంభిస్తుంది’" అని ఎయిర్‌లైన్ తెలిపింది.


ఈ విమానంలో తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, నదీముల్ హక్‌ సహా ఐదుగురు నేతలు కూడా ఉన్నారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘చావుకు అంచుల వరకు వెళ్లాం.. దాదాపు ప్రాణాలు పోయాయి అనిపించింది. ప్రయాణికులు కేకలు వేస్తూ, ప్రార్థనలు చేస్తూ భయంతో హాహాకారాలు చేశారు’ అని జర్నలిస్ట్ సాగరికా ఘోష్ చెప్పారు.


‘అతడే మన హీరో. విమానం ల్యాండ్ అయినప్పుడు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని తెలిసింది’ అని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత వారి ప్రతినిధి బృందం పైలట్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిందని చెప్పారు. భారత, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న సమయంలో విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సంఘటన మరోసారి హైలైట్ చేసింది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నపుడు గగనతల అనుమతులకు సంబంధించి పరిమితులు ఎలాంటి ప్రభావం చూపుతాయే ఈ ఘటన ద్వారా స్పష్టమైంది.


పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలూ పరస్పరం గగనతల అనుమతులు రద్దుచేశాయి. అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం మానవతాకోణంలో విమానాలను అనుమతించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, పాకిస్థాన్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఇక, కేంద్ర ప్రభుత్వం మాత్రం.. భారత విమానాలకు పాక్ గగనతల ప్రవేశాన్ని నిరాకరించడం సాధారణమైందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com