సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు ముందుగా ప్రేమలో పడతారు. ఆపై వారితో కొన్నాళ్లు కలిసి తిరిగాక వారిపై నమ్మకం ఉంటే పెళ్లి చేసుకుంటారు. ఎవైనా గొడవలు జరిగి ప్రేమ లేదనిపిస్తే బ్రేకప్ చెప్పేసుకుంటారు. బయట ఉంటే భాగస్వామి గురించి పూర్తిగా తెలియదని భావించిన వాళ్లు సహజీవనం కూడా చేస్తూ.. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది బాగుందనిపిస్తే ఆపై పెళ్లి, పిల్లలు.. ఇలా జీవితంలో ముందుకు వెళ్తుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ జంట మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.
ప్రేమించుకున్న వారు పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదని.. రెండు మనసులు పూర్తిగా కలిసి ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం ఉంటే చాలని నిరూపించారు. ముఖ్యంగా 70 ఏళ్లుగా సహజీవనం చేస్తూ 8 మంది పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. వారిని పెంచి పోషించి పెద్దవాళ్లను చేసి, పెళ్లిళ్లు కూడా చేసి వారికంటూ జీవితాలను ఇచ్చారు. ప్రస్తుతం మనవళ్లు, మనవరాళ్లతో జీవితాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తమ పిల్లల పిల్లలకు పెళ్లి చేయాల్సిన ఈ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 95 ఏళ్ల వయసు కల్గిన వృద్ధుడు.. తనతో 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న 90 ఏళ్ల వృద్ధురాలి మెడలో తాళి కట్టాడు.
రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామానికి చెందిన 95 ఏళ్ల రమాభాయ్ అంగారి.. అదే గ్రామానికి చెందిన 90 ఏళ్ల జీవాలి దేవితో సహజీనం చేస్తున్నాడు. అయితే 70 ఏళ్లుగా వీరిద్దరూ కలిసే ఉంటుండగా.. వీరికి ఇప్పటి వరకు పెళ్లి జరగలేదు. అయితేనేం వీరి ప్రేమకు ప్రతిరూపాలుగా నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు పుట్టారు. వివాహం చేసుకోకపోయినా ఇన్నాళ్లూ భార్యాభర్తల్లాగే హాయిగా కలిసున్న ఈ జంటకు మనవళ్లు, మనవరాళ్లు కూడా పుట్టి.. వారు కూడా పెళ్లీడుకు వచ్చారు. అందులో ఇప్పటికే కొందరి పెళ్లిళ్లు కూడా అయ్యాయి.
ఇదిలా ఉండగా.. జీవితం చరమాంకానికి వచ్చిన ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇన్నాళ్లూ సహజీవనం చేస్తున్న తాము భార్యాభర్తలుగా మారాలనుకుంటున్నట్లు పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు వివరించారు. దీంతో వారంతా తెగ సంబురపడిపోయి ఘనంగా వీరి వివాహం చేయాలనుకున్నారు. అదే విషయాన్ని గ్రామస్థులు, బంధువులకు కూడా చెప్పారు. ఇన్నాళ్లు తమకోసం ఎంతగానో కష్టపడిన తల్లిదండ్రులకు ఘనంగా పెళ్లి చేసి.. జీవితాంతం వారు మర్చిపోలేని అందమైన అనుభూతిని కల్పించాలనుకున్నట్లు వెల్లడించారు. అందుకు వారు కూడా ఒప్పుకుని.. మీతోపాటే పెళ్లిలో మేం కూడా ఉంటామని అన్నారు.
ఇలా జూన్ 1వ తేదీన వీరికి హల్దీ వేడుక నిర్వహించారు. ఆపై మెహందీ, సంగీత్ వంటి ఫంక్షన్లు కూడా చేశారు. 4వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. తమ సంప్రదాయం ప్రకారమే ఈ పెళ్లి చేయగా.. 95 ఏళ్ల రమాభాయ్ అంగారి.. 90 ఏళ్ల జీవాలి దేవి మెడలో తాళి కట్టారు. ఆపై వీరిద్దరినీ కారులో కూర్చోపెట్టి డీజే పెట్టి మరీ ఊరంతా ఊరేగించారు. అంతేనా వారితో కూడా నృత్యాలు చేయిస్తూ.. తెగ సంబురంగా గడిపారు. బంధువులు, గ్రామస్థులు, వారి పిల్లలు సహా రాత్రంగా ఈ బరాత్‌లో డ్యాన్సులు చేశారు.
అయితే పెళ్లి చేసుకోకుండానే వీరు ఇంత కాలం కలిసి ఉంటే ఎవరూ తప్పుపట్టలేదా, గ్రామస్థులు, వారి తల్లిదండ్రులు ఏమీ అనలేదా అనే అనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. కానీ వీరి ఆచార, సంప్రదాయాల ప్రకారం పెళ్లితో సంబంధం లేకుండా పురుషుడు, మహిళ పరస్పర అంగీకారంతో కలిసి జీవించే హక్కు ఉంటుంది. దీన్ని "నత ప్రథ" సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయం ప్రకారమే వీరు 70 ఏళ్లుగా సహజీవనం చేశారు. ఎట్టకేలకు పెళ్లి చేసుకుని.. భార్యాభర్తలు అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa