ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణసూర్యుడు -- పుణ్యార్జనలో దక్షుడు

Astrology |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 12:18 PM

భారతీయ పంచాంగము ప్రకృతితో సహజీవనం చేసేది, ఆ కారణంగా చిగుళ్ళతో ప్రారంభమయ్యే ఆకురాలుకాలం తో పూర్తయ్యే సంవత్సరం మనకే ఉంది. చైత్ర మాసం, పౌర్ణమి, తిధి ఇలాంటివన్నీ ఆకాశంలో  ప్రత్యక్షంగా కనిపించేవి. మిగిలిన కాలమానాల కు, సంవత్సర  గణనా లకు ఆకాశంలో ప్రమాణం ఏమీ లేదు. తేదీలు  మాత్రమే గుర్తు పెట్టుకుని తిధి సంస్కృతిని మరిచిపోతే సామాజిక స్థితి చాలా చాలా బాధాకరం.

భారత దేశం లో వేదాంగ మైన జ్యోతిషశాస్త్రం మానవులందరికీ అవసరమైన సహాయాన్ని చేస్తుంది. ఈ జ్యోతిష్య శాస్త్రం జాతక,  ముహూర్త,  సిద్ధాంత భాగాలే మూడు భాగాలుగా విస్తరించి ప్రచారంలో ఉంది.  తరువాత ప్రశ్న శకునాల అనే భాగాలు చేరి పంచ స్కంద సమన్విత శాస్త్రంగా జ్యోతిష్యం అందరికీ శుభ ఫలితాలను అందిస్తోంది. వీనిలో జాతకభాగము, భూత భవిష్యత్ వర్తమాన రూపమైన త్రికాల విషయాలను తెలియజేస్తూ జీవన యాత్రకు తోడ్పడుతుంది.


ముహుర్త భాగము కార్య సిద్ధిని, శుభఫలాలను  సమకూర్చి సహాయం చేస్తుంది
సిదంతా భాగము  పంచాంగ  రూపం గా ఏర్పడి దైనందిన యాత్రలో అనేక విధాలుగా సహాయం చేస్తుంది. ఈ భాగాలన్నీ కాలానికి సంబంధించినవి. సమయ వేత్తలు కాలాన్ని సంవత్సరం,  ఆయనం,  రుతువు,  మాసం,  పక్షం, దినం  అని ఆరు విధాలుగా విభజించి ధర్మాచరణకు శ్రేయ ప్రాప్తికి మార్గాన్ని చూపినారు.


ఇప్పుడు ముఖ్యంగా అయనం చూసినట్లయితే ఇది రెండు విధాలు
1. ఉత్తరాయణం... సూర్యుని మకరసంక్రమణం మొదలుఆరు రాసుల్లో  సంచారం వల్ల ఏర్పడేది ఆ సమయంలో భూమధ్యరేఖకు ఉత్తరంగా సూర్య సంచారం కనిపిస్తుంది
2. దక్షిణాయనం... సూర్యుని కర్కాటక సంక్రమణం మొదలు 6 రాసుల్లో సంచారం వల్ల ఏర్పడేది. ఆ  సమయములో భూమధ్య  రేఖకు దక్షిణంగా సూర్య సంచారము కనిపిస్తుంది.


ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు గ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు, అక్కడనుంచి నుంచి మిధునాని కి మారడానికి రెండున్నర రోజులు పడుతుంది. దాదాపు 12 రాశులు మారడానికి నెల రోజుల వ్యవధి పడుతుంది అనుకోవచ్చు. ఇక చూసినట్లయితే రాశి మార్పుకు  శనిగ్రహం 2 1/2 సం పడుతుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు, గురునికి ఒక సంవత్సరము ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్తవుతుంది.


సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు.
సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష ప్రకారం  ‘మేష సంక్రమణం’ అని,  సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని  ‘వృషభ సంక్రమణం’ అని సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని  ‘మిథున సంక్రమణం’ అని సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష  ‘కర్కాటక సంక్రమణం’ అని ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి  ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు. సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్ధం. ఇది సాధారణంగా జూలై 16వ తేదీ సుమారుగా ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షణాయన’ మని అంటుంటారు. మనకి సంవత్సరానికి అయనములు రెండు. ఒకటి ఉత్తరాయనం, రెండవది దక్షిణాయనం అని చెప్పుకున్నాము కదా ముందే. తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం సింహ సంక్రమణం, తర్వాత కన్యా రాశి ప్రవేశం కన్యాసంక్రమణం,  తులారాశి ప్రవేశం తులాసంక్రమణం  ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఆధారముగా ఆయా సంక్రమణంగా చెప్తాం. మకర సంక్రమణం(సంక్రాంతి), మకరరాశి ప్రవేశం!  అయితే సూర్యుని మకర సంక్రమణమే ‘ఉత్తరాయన పుణ్యకాలం’ అంటారుకదా.


సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు,  దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు దేవత ఆరాధన లు చేయడం. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు,పితృ తర్ఫణాలు చేయడం,సాత్వికాహారం భుజించటం మంచి  ఫలితాన్నిస్తాయి. సూర్య గమణాన్నిబట్టి ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.


దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో  (పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ సమీపంలోకి వచ్చే నెల) శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి గా వ్యవహరిస్తారు, మహా  భాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఆ తర్వాత మాసాల్లో వరలక్ష్మీవ్రతం,రాఖీపండుగ  శ్రీకృష్ణాజన్మ ష్టమి, వినాయక చవితి, దసరా,  దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు,  ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృసంబంధ కర్మలు నేరుగా  ఆ పితృ దేవతలకుచెందే  ఉత్తమమైనవి  సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి. దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను (అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి) దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండాఅనేక ఇబ్బందులు  కూడా నిర్ములిస్తాయి


అయనమ్ అంటే ప్రయాణం. ప్రాచీన భారతీయులు ఈ దృగ్విషయాన్ని ఉత్తరాయణం మరియు దక్షిణామం అని అభివర్ణించారు.  ఉత్తరాయణం 6 నెలలుదేవతలకు ఒకే రోజు, దక్షిణాయనం  6 నెలలు దేవతలకు ఒకే రాత్రి.  ఈ విధంగా మానవులకు ఒక సంవత్సరం దేవతలకు 1 రోజుకు సమానం.


 


ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం జపాలు కు,  సాధకులకు మంచి అద్భుత  ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది అనటంలో సందేహంలేదు. ఈ సమయంలో చేసే  దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే సర్వులకు మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు. ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది అనటంలో  అతిశయోక్తి లేదు.


 


శాస్త్రీయంగా చూసినా కూడా  సూర్యకిరణాలు దక్షిణాయం నెలల్లో చాలా తక్కువ.  ఇది మానవులలో రోగనిరోధక శక్తినితగ్గించి  మరియు జీర్ణవ్యవస్థ లో మార్పు   తెస్తుంది . మనం పాటించే  సంప్రదాయాలు మరియు ఆచారాలు ఉపవాసం, ధ్యానం మరియు భగవంతుని ఆరాధన అత్యుత్తమమార్గాలు.


ఈ ఆచారాలుపాటిస్తే  శరీరంలో రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాం. వ్యాధులు దరిచేరవు.


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com
www.padmamukhi.com






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa