ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాకాలంలో డెంగ్యూ డేంజర్, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 10:56 PM

వర్షాకాలంలో వానలు జోరందుకుంది. దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఇక, వర్షాకాలంలో అందర్నీ భయపెట్టే అంశం ఒకటి ఉంది. అదే దోమల భయం. వర్షం కారణంగా నీరు ఎక్కడిక్కడ నిల్వ ఉంటుంది. దీంతో, ఒకే చోట నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. దీంతో, దోమల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో దోమల వల్ల వ్యాపించే వ్యాధుల ప్రమాదం ఎక్కువ. మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ల ప్రమాదం పెరుగుతుంది. అయితే, అందర్నీ ఎక్కువగా భయపెట్టేది డెంగ్యూ.


ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బెంగళూరులో కేసులు ఎక్కువగా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా డెంగ్యూ కేసులు సాధారణంగా పెరుగుతాయని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ వ్యాప్తికి ఏడిస్ ఈజిప్ట్ దోమ కారణం. ఈ దోమ పగటి పూట ఎక్కువగా సంచరిస్తుంది. దీని కాటు వల్ల డెంగ్యూ వ్యాపిస్తుందని అధికారులు చెబుతున్నారు. డెంగ్యూ ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్నారు. డెంగ్యూ లక్షణాలు, కారణాలు, నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ విషయాలు ముఖ్యం


* వర్షాకాలంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇమ్యూనిటీ పవర్‌పై దృష్టి పెట్టడానికి సమతుల్య ఆహారం తీసుకోండి.


* తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, నట్స్ వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. తగినంత నీరు తాగండి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో రోజు ప్రారంభించండి.


* లీన్ ప్రోటీన్లు, తృణ ధాన్యాల్ని ఆహారంలో భాగం చేసుకోండి. వీటి వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.


* రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. వాకింగ్, జాగింగ్, యోగా వంటి వాటిని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి.


డెంగ్యూని ఎలా నివారించాలి?


* ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డెంగ్యూ దోమలు పగటిపూట ఎక్కువగా చురుగ్గా ఉంటాయి. అందుకే, పగటిపూట ఈ దోమలను నివారించాల్సిన అవసరం ఉంది.


* వీటిని నివారించడానికి ఫుల్ స్లీవ్స్ దుస్తులు ధరించండి. దోమలు ఎక్కువగా చేతులు, కాళ్ళపై కుడతాయి. అందువల్ల, ఫుల్ స్లీవ్స్ దుస్తులు ధరించడం ముఖ్యం.


* నిద్రపోయేటప్పుడు దోమతెరను వాడండి. పగటిపూట కూడా దోమ తెర వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల దోమ కాటు నుంచి తప్పించుకోవచ్చు.


* దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి కొన్ని సహజ చిట్కాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేప నూనె స్ప్రే, మిరియాల స్ప్రే, బిర్యానీ ఆకుల పొగ ప్రభావంతంగా పనిచేస్తాయి.


* దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు మెస్‌లు ఉపయోగించండి.


* ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా జాగ్రత్త పడండి. దీంతో, దోమలు గుడ్లు పెట్టలేవు.


* ఇంట్లోని కూలర్లలో దోమలు గుడ్లు పెట్టకుండా ఉండేలా నీటిని మారుస్తూ ఉండండి.


* ప్రతిరోజూ నీటి పాత్రలను శుభ్రం చేసి మూతలు పెట్టి ఉంచండి. అంతేకాకుండా ప్రతి వారం వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకోండి.


* ఇంటి చుట్టూ చెత్త పేరుకుపోకుండా చూసుకోండి. చెత్తబుట్టను కూడా కప్పి ఉంచండి.


డెంగ్యూ మరణానికి ఎలా కారణమవుతుంది?


డెంగ్యూ జ్వరాన్ని సరిగ్గా నిర్వహించకపోతే, అనేక సమస్యలు తలెత్తవచ్చని.. దీనివల్ల మరణ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఊబకాయం, ఉబ్బసం, రక్తపోటు లేదా ఏదైనా హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే, 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో కూడా ఈ ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే డెంగ్యూ ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాల సమస్య ఉంటే కూడా ప్రమాదం పెరుగుతుంది. అయితే, సకాలంలో తగిన చికిత్స పొందిన వారిలో, ఒక శాతం కంటే తక్కువ మరణాలు సంభవిస్తాయి. కానీ చికిత్స అందుబాటులో లేని సందర్భాల్లో, మరణాల రేటు 10-20 శాతానికి పెరుగుతుంది. అందువల్ల, దాని లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం.


డెంగ్యూ తీవ్రత


డెంగ్యూ యొక్క తీవ్రమైన రూపాల్లో డెంగ్యూ హెమరేజిక్ జ్వరం (DHF), డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DSS) ఉన్నాయి. DHF రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ఇక, DSS రక్తపోటు తగ్గడానికి కారణమవుతుంది. దీని వల్ల శరీర అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. ఈ రెండు పరిస్థితులు కూడా ఆరోగ్యానికి హానికరం.


డెంగ్యూ లక్షణాలు ఏంటి?


* అధిక జ్వరం


* తీవ్రమైన తలనొప్పి


* కండరాలు, ఎముకలలో నొప్పి


* చర్మంపై దద్దుర్లు


* కళ్ళలో నొప్పి


* వికారం


* కడుపు నొప్పి లేదా తిమ్మిరి


* రక్తస్రావం


* అలసట


* చిరాకు


* ఉబ్బిన గ్రంథులు


* ముక్కు లేదా చిగుళ్ళ నుంచి రక్తస్రావం


* లేత లేదా చల్లని చర్మం


* విశ్రాంతి లేకపోవడం


* తరచుగా దాహం వేయడం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa