ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకున్న రోగం..మీ నాలుకే తేల్చేస్తుంది

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 11:41 PM

చాలా సార్లు ఒక పెద్ద సమస్య వచ్చేంతవరకు.. మనకు ఉన్న ఆరోగ్య సమస్యల్ని గుర్తించలేం. చాలా సార్లు శరీరం ముందుగానే సంకేతాల్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ, మనమే వాటిని పట్టించుకోం. ఇక, మనం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఆయన నాలుక చూపించమని అడుగుతారు. నాలుక మీద కనిపించే లక్షణాల్ని బట్టి మన ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు. నాలుక మీద కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపించగానే అలర్ట్ అవ్వాలి. నాలుక మన ఆరోగ్యానికి అద్దం. అందువల్ల, నాలుకలో మార్పులు ఏదో ఒక రకమైన అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చు. చాలా మంది ఈ లక్షణాల్ని అంతగా పట్టించుకోరు. ఆరోగ్యం ప్రమాదంలో పడినప్పుడు నాలుకపై కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


నాలుక రంగులో మార్పు


* సాధారణ నాలుక గులాబీ లేదా లేత ఎరుపు రంగులో ఉంటుంది. దాని రంగు మారితే, అది ఏదైనా అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చు.


* తెల్లటి నాలుక: ఇది డీహైడ్రేషన్, నోటి త్రష్ (ఫంగల్ ఇన్ఫెక్షన్) లేదా ల్యూకోప్లాకియా (ధూమపానం వల్ల కలిగే సమస్య) లక్షణం కావచ్చు.


* పసుపు నాలుక: కాలేయం లేదా కడుపు సమస్యలు, అధిక ధూమపానం లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు.


* నల్ల నాలుక: ఇది బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరుగుదల వల్ల వస్తుంది. ఇది తరచుగా నోటి పరిశుభ్రత లేకపోవడమో లేదా యాంటీబయాటిక్స్ యొక్క దుష్ప్రభావంగానో వచ్చే అవకాశం ఉంది.


* నీలం లేదా ఊదా రంగు నాలుక: ఇది ఆక్సిజన్ లేకపోవడం, గుండె జబ్బులు లేదా రక్త ప్రసరణ సమస్యలను సూచిస్తుంది.


నాలుకపై తెలుపు, నలుపు లేదా ఆకుపచ్చ పూత


* నాలుకపై పూత అంటే దానిపై బ్యాక్టీరియా, చనిపోయిన కణాలు లేదా ఫంగస్ పేరుకుపోయాయని అర్థం.


* తెల్లటి పూత: నోటి త్రష్, డయాబెటిస్ లేదా బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతం.


* నల్లటి పూత: ధూమపానం, ఎక్కువగా కాఫీ తాగడం లేదా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల సంభవించవచ్చు.


* ఆకుపచ్చ పూత: ఇది తరచుగా జరగదు. కానీ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా కాలేయ సమస్యకు సంకేతం కావచ్చు.


నాలుక వాపు


* నాలుక సాధారణం కంటే ఎక్కువగా ఉబ్బినట్లు అనిపిస్తే, దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.


* అలెర్జీ ప్రతిచర్య: ఏదైనా ఆహార పదార్థం, ఔషధం లేదా కీటకాల కాటు నాలుకలో వాపుకు కారణమవుతుంది.


* హైపోథైరాయిడిజం: థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వల్ల నాలుక మందంగా, వాపుగా మారుతుంది.


* విటమిన్ బి12 లోపం: విటమిన్ బి12 లోపం ఉంటే నాలుక వాపు, ఎర్రగా, మృదువుగా మారుతుంది.


నాలుకపై బొబ్బలు లేదా ఎర్రటి మచ్చలు


* నాలుకపై బొబ్బలు లేదా ఎర్రటి మచ్చలు అనేక కారణాల వల్ల తలెత్తవచ్చు.


* నాలుక పూత అనేది ఒత్తిడి, విటమిన్ లోపం లేదా ఎక్కువ ఆమ్ల ఆహారం తినడం వల్ల వస్తుంది.


* స్కార్లెట్ జ్వరం ఉంటే నాలుకపై స్ట్రాబెర్రీ లాంటి ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి.


* రోగనిరోధక శక్తి బలహీనపడినప్పుడు నాలుకపై నిరంతర పుండ్లు కనిపించవచ్చు. ఇది హెచ్‌ఎవీలో ఎక్కువగా కనిపిస్తుంది.


నాలుక తిమ్మిరి, జలదరింపు


మీ నాలుక తిమ్మిరిగా, జలదరింపుతో ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. నాలుక తిమ్మిరిగా లేదా జలదరింపుగా అనిపిస్తే.. అది నాడీ సంబంధిత సమస్యలు, విటమిన్ బి12 లోపం లేదా మధుమేహానికి సంకేతం కావచ్చు. ఈ లక్షణం పదే పదే కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa