కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంలో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జీఎస్‌టీ శ్లాబులను తొలగించి, కేవలం 5 శాతం, 18 శాతం జీఎస్‌టీ రేట్లను మాత్రమే ఉంచాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు పంపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దీపావళికి ప్రజలకు పెద్ద బహుమతి లభిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 శాతం, 18 శాతం పన్ను రేట్లు ఉంటే చాలా వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. 12 శాతం శ్లాబులోని 99 శాతం వస్తువులను 5 శాతం శ్లాబుకు, 28 శాతం శ్లాబులోని 90 శాతం వస్తువులను 18 శాతం శ్లాబుకు మార్చాలని ప్రతిపాదించారు. వినియోగదారుల వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి 18 శాతం శ్లాబుకు మార్చనున్నారు. ఇదే సమయంలో పొగాకు, పాన్ మసాలా వంటి సిన్ గూడ్స్ పై మాత్రం 40 శాతం కొత్త శ్లాబును తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన జీఎస్టీ మండలిలోని మంత్రుల బృందానికి కూడా పంపనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసి సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశం నిర్ణయం తీసుకోనున్నారు.
జీఎస్‌టీ సంస్కరణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. 'ఈ దీపావళికి, నేను మీకు డబుల్ దీపావళి చేయబోతున్నాను. ఈ దీపావళికి నా దేశ ప్రజలారా మీకు ఒక పెద్ద బహుమతి లభించబోతోంది. గత 8 సంవత్సరాలలో మేము జీఎస్‌టీలో ఒక పెద్ద సంస్కరణ చేశాం. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించాం. పన్ను విధానాన్ని సరళీకృతం చేశాం. 8 సంవత్సరాల తరువాత, దానిని ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. మేము ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా సమీక్షను ప్రారంభించాం. రాష్ట్రాలతో కూడా చర్చలు జరిపాం.
మేము తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో వస్తున్నాం. ఇది మీకు ఈ దీపావళికి బహుమతి. సామాన్యులకు అవసరమైన పన్నులు గణనీయంగా తగ్గుతాయి. చాలా సౌకర్యాలు పెరుగుతాయి. మా ఎంఎస్‌ఎంఈలకు, చిన్న పారిశ్రామికవేత్తలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. రోజువారీ వస్తువులు చాలా చౌకగా మారుతాయి. అది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుంది' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ప్రస్తుతం ఉన్న పన్ను శ్లాబుల సంఖ్యను తగ్గించడం ద్వారా పన్నుల గందరగోళాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పన్ను విధానం ద్వారా వస్తువుల ధరలు తగ్గుతాయని, ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎస్టీ మండలి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాయి. జీఎస్టీ మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa