శరీరానికి ఐరన్ ఎంతో ముఖ్యం. అయితే, ఐరన్ లోపం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఐరన్ లోపాన్ని సరైన టైమ్‌లో గుర్తిస్తే పెద్ద ప్రమాదాన్ని నుంచి తప్పించుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇక, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అవసరమైన అన్ని పోషకాలు ఉండటం చాలా ముఖ్యం. వీటిలో ఏదైనా లోపం ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందులో ఐరన్ లోపం ఒకటి. ఐరన్ లోపాన్ని సాధారణంగా రక్తహీనత అని కూడా అంటారు. మన శరీరానికి అవసరమైన తగినంత ఐరన్ అందనప్పుడు ఈ సమస్య వస్తుంది.
ఐరన్ ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్‌లో ఒక ముఖ్య భాగం. హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్తుంది. ఐరన్ లోపించినప్పుడు, శరీరం తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల కణజాలాలకు, అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. ఇక, ఐరన్ లోపం ఉన్నప్పుడు చేతులతో పాటు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలేంటి, దానిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బలహీనమైన గోర్లు
ఐరన్ లోపం వల్ల.. గోర్లు సన్నగా, పెళుసుగా మారతాయి. దీంతో అవి సులభంగా విరిగిపోతాయి. కొన్నిసార్లు గోళ్ల ఆకారం కూడా మారిపోతుంది. ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
అరచేతులు, గోర్ల రంగు మారడం
హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల చర్మం, గోళ్ల రంగు మారుతుంది. ముఖ్యంగా అరచేతులు రంగు మారుతుంది. అరచేతులు, గోళ్ల రంగు పసుపు మారితే అలర్ట్ కావాల్సిందే. హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఈ రంగు కనిపిస్తుంది. మీకు కూడా ఈ లక్షణం కనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
చేతులు, కాళ్లు చల్లగా మారడం
మీకు ఏ సమస్య లేకపోయినా పదే పదే మీ చేతులు, కాళ్లు చల్లగా మారుతున్నాయా, అయితే మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఐరన్ లోపం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని కారణంగా చేతులు, కాళ్ళు చల్లగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
చేతులు తిమ్మిరి, జలదరింపు
మీకు అప్పుడప్పుడు చేతులు తిమ్మరిగా మారుతున్నాయి. లేదా ఉన్నట్టుండి చేతులు జలదరింపు అనుభూతి చెందుతున్నాయా, అయితే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే అని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపం వల్ల చేతులు తిమ్మిరి లేదా జలదరింపు అనుభూతి చెందుతాయి.
ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి
* చర్మం, పెదవులు, గోర్లు, కనురెప్పల లోపలి భాగం పాలిపోయినట్లు కనిపిస్తుంది.
* చిన్నపాటి శారీరక శ్రమ చేసినా ఆయాసం రావడం, శ్వాస ఆడకపోవడం.
* నిలబడినప్పుడు లేదా ఏదైనా పని చేసిన తర్వాత తలతిరగడం.
* జుట్టు పొడిబారి, ఎక్కువగా రాలడం.
* మైగ్రేన్ లాంటి తలనొప్పులు తరచుగా రావచ్చు.
* త్వరగా లేచినప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపించడం.
* తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవడం. అంటే రోగాల బారిన పడటం
ఐరన్ లోపాన్ని అధిగమించే ఆహారాలు
* పాలకూర: పాలకూర ఐరన్ యొక్క మంచి మూలం. 100 గ్రాముల పాలకూరలో దాదాపు 2.7 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణను పెంచుతుంది. పాలకూరను కూరగా, సూప్ లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు.
* బీట్‌రూట్: బీట్‌రూట్ రక్తాన్ని పెంచడమే కాకుండా, ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లతో కూడా సమృద్ధిగా ఉంటుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం లేదా సలాడ్లలో చేర్చడం వల్ల రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.
* దానిమ్మ: దానిమ్మలో ఐరన్‌తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఐరన్ శోషణకు సాయపడుతుంది. రోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు లేదా దాని రసం తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
* వేరుశనగ, నువ్వులు: వేరుశనగ, నువ్వులలో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. వాటిని వేయించి లేదా లడ్డుగా చేసి తినడం వల్ల ఐరన్ లోపం తొలగిపోతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
* పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు: పప్పుధాన్యాలు, కిడ్నీ బీన్స్, చిక్‌పీస్, సోయాబీన్స్ వంటి పప్పుధాన్యాలు ఐరన్, ప్రోటీన్‌కు మంచి మూలం. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa